మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సారంగపల్లి అటవీప్రాంతంలో సోమవారం వృద్ధుని మృతదేహం లభ్యమైనట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శశిధర్‌రెడ్డి తెలిపారు. రామకృష్ణాపూర్‌లోని అబ్రహంనగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు వేల్పుల ఎల్లయ్య (70) ఈ నెల 2న మేకలు మేపడానికి సారంగపల్లి అటవీప్రాంతానికి వెళ్లాడు.
చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో 3న మృతుని కుమారుడు రమేశ్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సోమవారం మృతదేహాన్ని గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. రామకృష్ణాపూర్, మందమర్రి ఎస్సైలు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా వేల్పుల ఎల్లయ్య మృతదేహంగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.