
భీం ఆశయం నెరవేరేదెన్నడో!
గిరిజన చట్టాలను కాలరాస్తున్న పాలకులు 5వ షెడ్యూల్‌కు తూట్లు ప్రేక్షక పాత్రలో అధికారులు రిజర్వేషన్లతో ఆదివాసీల్లో ఆందోళన
కడు దయనీయం
కెరమెరి(ఆసిఫాబాద్): నాటి నుంచి నేటి వరకు ఆదివాసీల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. భూమి, నీరు, అడవిపై ఇంకా హక్కులు రాలేదు. గిరిజన చట్టాలు గిరిజనేతరులకు చుట్టాలవుతున్నాయి. అప్పటి నిజాం సర్కారు ఆదివాసీ భూముల రక్షణకోసం భూ బదలాయింపు చట్టం 1/70 తీసుకువచ్చింది. కానీ అధికార యంత్రాంగం ఆదివాసీల భూముల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనుల భూములను గిరిజనేతరులు గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించుకుంటున్నారు. భూ బదలాయింపు నిషేధం ఉన్న షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలసలు పెరిగి భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. దీంతో గిరిజనులు మళ్లీ అడవిలో చెట్లను నరుక్కుని బతకాల్సిన పరిస్థితులు దాపురించాయి. అందులో కూడా గిరిజనులను బతకనీయకుండా అటవీశాఖ అధికారులు తరిమేస్తున్నారు.
ఉపయోగంలోకి రాని ఐదో షెడ్యూల్
భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం అడవి, భూమి, నీటిపై గిరిజనులకు పూర్తి హక్కులు ఉన్నప్పటికీ నూతన చట్టాలు వాటికి తూట్లు పొడుస్తున్నాయి. 2005లో బిల్లు ప్రవేశపెట్టి హక్కులను కల్పిస్తామని గత ప్రభుత్వాలు చెప్పినా అవి అమలు కాలేదు. ఐటీడీఏ నిధులతో నిర్మించిన కుంటలు, చెరువుల్లో పెంచుతున్న చేపలు, రొయ్యలపై ఆదివాసీలకే హక్కులున్నాయని చట్టాలు చెబుతున్నా వారి గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. కొంత కాలంగా వలసలుగా వచ్చినవారు ఎస్టీలుగా చలామని అవుతూ నిజమైన గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు.
కనుమరుగవుతున్న జీవోలు
ఆదివాీసీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన జీవోలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు వందశాతం గిరిజనులకే చెందాలని పొందుపర్చబడ్డ జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏజెన్సీలోని గిరిజనులకు 50 శాతం మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఇటీవల ఉపాధ్యాయ ఉద్యోగాల్లో ఏజెన్సీ, నాన్‌ఏజెన్సీకి సంబంధం లేకుండా గిరిజనేతరులను భర్తీ చేసింది.
‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో భూమి, నీరు, అడవిపై ఆదివాసీలకు హక్కులకోసం నిజాం ప్రభుత్వంతో జరిపిన పోరాటంలో అసువులు బాసిన గిరిజనుల ముద్దుబిడ్డ కుమురంభీం. ఆయన మరణించి 85 ఏళ్లు కావస్తున్నా ఆశయం మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. నేటికీ గిరిజనులు తాగు, సాగునీరు, రోడ్డు సౌకర్యం, సాగు చేస్తున్న భూములకు పట్టాలులేక అలమటిస్తున్న పల్లెలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కుమురంభీం 85వ వర్ధంతి సందర్భంగా కథనం.
రిజర్వేషన్లతో ఏజెన్సీలో గుబులు
5వ షెడ్యూల్ గిరిజన చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజనేతరులకు రిజర్వేషన్‌లలో అవకాశం ఉండదు. కానీ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతంలోనూ గిరిజనేతరులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారు. ఈ క్రమంలో 5వ షెడ్యూల్ అమలులో ఉండగా ఇదెలా సాధ్యమని, భవిష్యత్‌లో ఉద్యమ కార్యచరణ చేపట్టనున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

భీం ఆశయం నెరవేరేదెన్నడో!