
కుటుంబ తగాదాలతో యువకుడి బలవన్మరణం
వేమనపల్లి: కుటుంబ తగాదా లతో ఉరేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నీల్వాయి ఎస్సై కోటేశ్వర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాజా రం గ్రామంలోని కుర్మగూడెంకు చెందిన దైవాల బీరేష్ (22) తాత మల్లయ్య గతేడాది మృతి చెందగా శనివారం 9 నెలల మాసికం కార్యక్రమం నిర్వహించారు. భోజనాల అనంతరం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన బీరేష్ సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని ఎల్లమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి మొండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృతి
ముధోల్: ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన సయ్యద్ కాశీం అలీ (54) పంటచేను చెరువుపక్కనే ఉంది. ఆదివారం ఉదయమే పొలానికి వెళ్లిన అలీ స్నానం చేసేందుకు చెరువులో దిగడంతో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
ఒకరిపై పీడీయాక్టు
ఇచ్చోడ: మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన అల్తాపాపై ఆదివారం పీడీయాక్టు కేసు నమోదు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడు గతంలో అటవీ అధికారులు, పోలీసులపై దాడి చేయడంతో ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో 11 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుడు కొంతకాలంగా పలు కేసుల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని చర్లపెల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు.

కుటుంబ తగాదాలతో యువకుడి బలవన్మరణం