
వాగులో కొట్టుకుపోయిన ఎడ్లబండి
కాసిపేట: మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం పాతబస్తీ శివారులో ఉన్న వాగులో ఎడ్లబండి కొట్టుకు పోయిన ఘటనలో ఆవు, ఎద్దు మృతి చెందగా రైతు, మరో ఎద్దు ప్రాణాలతో బయట పడ్డారు. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లంబాడితండాకు చెందిన బానోత్ బలరాం పెద్దనపల్లి శివారులో పొలం పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం పొలం వద్ద ఉన్న ఎడ్లు, ఎడ్లబండిని తీసుకు వచ్చేందుకు కాలినడకన వెళ్లాడు. వెళ్తున్న క్రమంలో వాగు దాటగా మోకాలి లోతులో ఉండటంతో పొలం వద్దకు వెళ్లి ఎడ్లబండి సహా మరో ఆవును బండికి కట్టుకొని బయలు దేరాడు. వెళ్లేటప్పుడు వాగు లోతు తక్కువగా ఉండటంతో అదే నమ్మకంతో చీకట్లో వాగు దాటుతుండగా వరద ఉధృతి పెరిగి ఎడ్లబండి కొట్టుకు పోయింది. ఈక్రమంలో తనకు ఒక చెట్టుకొమ్మ దొరకడంతో పట్టుకుని ఎద్దును ఎడ్లబండి నుంచి వేరు చేసి కాపాడాడు. దీంతో ఎద్దు, మరో ఆవు ఎడ్ల బండితో సహా కొట్టుకు పోయి మృతి చెందాయి. మృతి చెందిన ఎద్దు, ఆవు విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని వాపోయాడు.