
మోసగించిన ముగ్గురిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: మల్టీ మార్కెట్ పేరిట నకిలీ ఔషధాలు అంటగడుతూ మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. శనివారం టూటౌన్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. సింగాపూర్, పంజాబ్, తదితర ప్రాంతాల నుంచి ఆరోగ్యానికి సంబంధించిన ఔషదాలు తీసుకొచ్చామని చెబుతున్నారని, ప్యాకెట్లను జిల్లాలో విక్రయిస్తున్నారు. అన్నిరకాల రోగాలు నయమవుతాయని ప్రజలను నమ్మ బలుకుతున్నారు. ఆదిలాబాద్‌లో నకిలీ ఔషధ ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తే ఇది వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో ఉంటున్న నార్నూర్‌కు చెందిన మహేందర్, తాంసి మండలం బండల్‌నాగా పూర్‌కు చెందిన రాకేశ్ విక్రయిస్తున్నారని, ఈ ఇద్దరు ఆసిఫాబాద్ జిల్లా కు చెందిన ముకుంద్‌రావు వద్ద కొనుగోలు చేశారు. 6 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, ఒక్కో ప్యాకెట్‌ను రూ.5,800 వరకు, మరికొంత మందికి ఇష్టమున్న ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.