
బీసీలకు 42శాతం రిజర్వేషన్‌తోనే ఎన్నికలు జరగాలి
మంచిర్యాలటౌన్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీలకు 42శాతం రిజర్వేషన్‌తోనే ఎన్నికల నిర్వహణ జరగాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌తో కలిసి మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిస్తోందని, కాంగ్రెస్ పార్టీ దగ్గరి వ్యక్తులు కోర్టులో కేసులు వేసి ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వేల కోట్ల నిధులు మంజూరు చేస్తోందని, స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొయ్యల ఏమాజి, గాజుల ముఖేశ్‌గౌడ్, ముత్తె సత్తయ్య, కమలాకర్‌రావు, పట్టి వెంకటకృష్ణ, జోగుల శ్రీదేవి, అక్కల రమేశ్, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, పులగం తిరుపతి, మంత్రి రామయ్య, బెడద సురేశ్, నాగేశ్వర్‌రావు, శైలేందర్‌సింగ్ పాల్గొన్నారు.