
‘కడెం’ ఆధునికీకరణకు ఉద్యమం
దండేపల్లి: చెన్నూరు వరకు సాగునీరు అందించాలని మండలంలోని నెల్కివెంకటాపూర్‌కు చెందిన గాదె శ్రీనివాస్ కొంతమంది రైతులతో కలిసి దసరా పండుగను పురస్కరించుకుని గురువారం కడెం ప్రాజెక్ట్ ఆధునికీకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కడెం ప్రాజెక్ట్ నీటిని చెన్నూరు వరకు అందించేందుకు 1987లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హాజీపూర్ మండలం పెద్దంపేట వద్ద మందాకిని కాలువ నిర్మాణానికి భూమిపూజ చేశారని, అది ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. కడెం నీటిని చెన్నూర్ వరకు అందించాలంటే మొదటగా కడెం ప్రాజెక్ట్‌ను ఆధునికీకరించాలన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నీరు హాజీపూర్ మండలం వరకే అందించడం గగనంగా మారిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు కడెం ప్రాజెక్ట్ ఆధునికీకరణపై దృష్టిసారించి అప్పటి ప్రధాని, ముఖ్యమంత్రుల హామీ లను అమలు చేయాలని కోరారు. కడెం ప్రాజెక్టును ఆధునికీకరించే వరకు ఆయకట్టు రైతులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.