
రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి
భైంసాటౌన్: పట్టణానికి చెందిన హోమియోపతి వైద్యుడు కుమార్ యాదవ్ (43) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. పురాణాబజార్‌కు చెందిన డాక్టర్ కుమార్ యాదవ్ గురువారం బైక్‌పై నిర్మల్ వైపు వెళ్లి తిరిగి సాయంత్రం భైంసా వైపు వస్తుండగా, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే మార్గంలో భైంసా–నిర్మల్ హైవేపై ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఏదైనా వాహనం ఢీకొందా.. లేదా అదుపు తప్పి కిందపడ్డాడా? అనే విషయం తెలియరాలేదు. అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. కుమార్ యాదవ్ స్థానికంగా హిందూ ఉత్సవ సమితి సభ్యుడిగా ఉంటూ స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. దీంతో ఆయన మృతిపై పట్టణానికి చెందిన వైద్యులు, పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.