
అశ్వరథంపై అమ్మవారి ఊరేగింపు
శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. గురువారం సాయంత్రం 4గంటల సమయంలో ఆలయ అర్చకులు సరస్వతీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అశ్వరథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూర్చోబెట్టి భక్తుల దర్శనార్థం గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అశ్వరథం గ్రామంలోకి రావడంతో మహిళలు మంగళహారతులతో అమ్మవారికి ఘనస్వాగతం పలికారు. భక్తి గీతాలు, కోలాటాల మధ్య అమ్మవారి అశ్వరథం ఊరేగింపు కొనసాగింది. శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి అశ్వరథం ఊరేగింపు కోసం స్వచ్ఛందంగా గ్రామానికి చెందిన ప్యా ట్ల సుఖేశ్‌రావు కుటుంబ సభ్యులు ముందుకు వ చ్చారు. ఈ సందర్భంగా వారిని దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి అంజనాదేవి, ఏఈ వో సుదర్శన్‌గౌడ్ శాలువాతో సన్మానించారు.
బాసరకు శృంగేరి పీఠాధిపతి
కర్ణాటక రాష్ట్రంలోని మహాస్థానం దక్షిణమనయ శ్రీశారదాపీఠం శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీయ సన్నిధానం పీఠాధిపతి బాసరకు రానున్నారు. శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్ర పర్యటన ఈ నెల 17 నుంచి 19వరకు కొనసాగనుంది. నేపాల్, న్యూఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా యాత్ర చేపడుతూ బాసరలో సరస్వతీ అమ్మవారికి రెండురోజులపాటు ప్రత్యేక పూజలు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.