
అతివలకు అండగా షీటీం
ఆదిలాబాద్‌టౌన్: షీటీం 24గంటలు సేవలందిస్తోందని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణకు పని చేస్తోందని పేర్కొన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో రాత్రి వేళ మహిళలను వేధించిన ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 16 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దసరా సందర్భంగా రాత్రి వేళ దస్నాపూర్ ప్రాంతంలో మహిళలను వేధించిన జిల్లా కేంద్రానికి చెందిన షిండే రాహుల్, యోగేశ్, పద్మశాలీ విఠల్, షిండే నితిన్, అడలోలు నరేశ్, రోహిత్, బొంపల్లి ప్రసాద్, షేక్ పర్వేజ్, ధూత్రి పరమేశ్వర్‌పై మావల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఇటీవల ఆది లాబాద్ నుంచి మహారాష్ట్రలోని కేళాపూర్ వెళ్లే పాదయాత్ర సమయంలో మహిళను వేధించిన మడావి దత్తుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు, పని స్థలాల్లో మహిళలకు 20 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో 24 ఈ పెట్టీ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నెల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 119 హాట్‌స్పాట్‌లను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆరు కౌన్సిలింగ్‌ల ద్వారా కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఆపద ఎదురైతే ఆదిలాబాద్ షీటీం బృందాలకు 8712659953 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈనెలలో మహిళల నుంచి దాదాపు 31ఫోన్‌కాల్స్ ద్వారా ఫిర్యాదులు రాగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు.