
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల్లో నోడల్ అధికారులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నోడల్ అధికారులు, ఎంపీడీవోలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో నియమావళి అమలు చేపట్టాలని, రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సభలు, సమావేశాలకు అనుమతి జారీ చేస్తారని, సమాచారాన్ని ఖర్చుల పర్యవేక్షణ బృందానికి అందిస్తే పరిశీలన చేస్తారని తెలిపారు.
నియమావళి పాటించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతీ అంశంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశాల్లో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో గణపతి, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్, శిక్షణ నోడల్ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలు 72 గంటల్లో తొలగించాలి
జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, 48 గంటల్లో పబ్లిక్ ప్రాంతాలు, 72 గంటల్లో పూర్తిగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సంబంధిత అంశాలు తొలగించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల అధికారులు విధులు నిర్వర్తించాలని తెలిపారు.