
జిల్లాలోనే క్యాన్సర్‌కు చికిత్స
మంచిర్యాలటౌన్: క్యాన్సర్ వైద్యానికి ఇకపై హైదరాబాద్ వంటి నగరాలకు పరుగెత్తకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలోనే క్యాన్సర్‌కు చికిత్సను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచిర్యాలలో ఫలించాయి. దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన మహిళకు ఊపిరితి త్తుల క్యాన్సర్‌కు సంబంధించిన కీమోథెరపిని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)కి అనుబంధంగా కొనసాగుతున్న మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ సెంటర్‌లో మంగళవారం విజయవంతం చేశారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో రెండుసార్లు కీమోథెరపి నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్యాన్సర్ కేర్ సెంటర్‌కు పంపించారు. మూడోసారి కీమోథెరపిని జిల్లా కేంద్రంలో విజయవంతంగా మొదటిసారి చేపట్టడంతో ఇకపై జిల్లా కేంద్రంలోనే క్యాన్సర్‌కు చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రరెడ్డి తెలిపారు. జీజీహెచ్‌కు చెందిన డాక్టర్ ఆశ్లేష, ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్లు ఎంఎన్‌జెలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఇక్కడ కీమోథెరపిని మొదటిసారి కావడంతో ఎంఎన్‌జే ఆసుపత్రికి చెందిన కీమోథెరపి నర్సింగ్ ఆఫీసర్ దుశ్యంత్‌కుమార్ ప్రత్యేకంగా మంచిర్యాలకు వచ్చారు. గతంలో ప్రతీ సైకిల్‌కి క్యాన్సర్ రోగులు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై జిల్లాలోనే సేవలను కొనసాగించేలా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఆశ్లేష, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.