
మహిళా సంఘాలకు అద్దె బస్సుల బాధ్యత
పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక స్వాలంబనకు కృషి చేస్తోంది. తాజాగా మహిళలు మరింత ప్రగతి సా ధించడానికి అద్దె బస్సులు మంజూరు చేస్తోంది. ఈ బస్సులను ఆర్టీసీ డిపోల్లో అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమాఖ్యల నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతీ మండల సమాఖ్యకు ఒక బస్ చొప్పున 16 మండలాల సమాఖ్యలకు 16 బస్‌లు మంజూరు చేయాల ని ప్రతిపాదించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.36 లక్షలను ప్రభుత్వం రుణంగా మండల సమాఖ్యలకు మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటాగా మండల సమాఖ్య సీఐఎఫ్ నిధులను వెచ్చిస్తారు. ఆర్టీసీ ద్వారా వచ్చే అద్దెను మండల సమాఖ్యల ఖాతాల్లో జమ చేస్తారు. అందులో నుంచి ప్రభుత్వం ఇచ్చిన రూ.36 లక్షల రుణాన్ని ఏడేళ్లలో 84 ఈఎంఐలుగా మండల సమాఖ్యలు ప్రభుత్వానికి సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు సోలా ర్ ప్లాంట్లు, పెట్రోల్‌బంక్‌లు మంజూరు చేయగా తాజాగా అద్దె బస్సులు కూడా మంజూరు చేసి స్వయం సహాయక సంఘాల సభ్యులను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తెలిపారు.
ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలోని మండల సమాఖ్యలకు అద్దెబస్సుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన తర్వాత బస్సులు కొనుగోలు చేస్తాం. మండల సమాఖ్యల పేరున హైపోథికేషన్‌తో జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో అద్దెకు ఇస్తాం.
– ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి