
పండుగ పూట పస్తులేనా?
శ్రీరాంపూర్: ‘ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం.. ఒకే గమ్యం’ అనే సింగరేణి నినాదం గోడలపైనే గాని ఆచరణలో కనిపించడంలేదు. వేతనాలు, లాభాల బోనస్ అందక ఎస్సార్పీ ఓసీపీ ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా పండుగరోజు వారు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. ఓబీ పనులు నిర్వహించే సీఆర్‌ఆర్ కాంట్రాక్టర్ మూడు నెలలుగా 600 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. సెప్టెంబర్ 29న లాభాల బోనస్ డబ్బులు ఇస్తారనుకుంటే అవీ అందలేదు. ఈ దుస్థితికి కాంట్రాక్టర్, కంపెనీ అధికారులు బాధ్యత వహించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నెలరోజులుగా ఆందోళన
సదరు కాంట్రాక్ట్ సంస్థ నాలుగేళ్ల కాలానికి ఓబీ పనుల టెండర్ దక్కించుకుంది. ఇంకా సుమారు 15నెలలు పని చేయాల్సి ఉంది. ఆగస్టు 26నుంచి పనులు నిలిపివేసింది. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మూడు నెలల వేతనం రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పది రోజులుగా ఆందోళన, ధర్నాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
కంపెనీ బాధ్యత లేదా?
కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకుంటే కంపెనీకి బాధ్యత ఉందా.. లేదా? అన్న చర్చ జరుగుతోంది. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ సెక్షన్ 20, సబ్ సెక్షన్ 4 ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌గా ఎవరైతే సింగరేణి అధికారులు ఉంటారో వారే ఈ వేతనాలు చెల్లించి తర్వాత కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసుకోవాలి. దీన్ని కంపెనీ అధికారులు పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం లాభాల బోనస్ ఇస్తేనైనా కొంత ఊరట ఉంటుందనుకుంటే అదీ చెల్లించడం లేదని వారు వాపోతున్నారు.
కాంట్రాక్టర్ స్పందించడం లేదు
సీఆర్‌ఆర్ కాంట్రాక్టర్ స్పందించడం లేదు. అతని బిల్లుల నుంచి డబ్బులు కట్ చేసి కార్మికులకు జీతాలు ఇద్దామనుకుంటే పనీ.. జరగలేదు. బిల్లులు పెండింగ్‌లో లేవు. కంపెనీకే అతను డీజిల్ ఫెనాల్టీలు చెల్లించాలి. ఎలాగైనా కనీసం లాభాల బోనస్ చెల్లించాలని చూస్తున్నాం. నేరుగా మేమే చెల్లించాలా, సదరు కాంట్రాక్టర్ ద్వారా చెల్లించాలా? అనే దానిపై అధికారులతో చర్చిస్తున్నాం.
– ఎం శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్