భూ అక్రమార్కులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

భూ అక్రమార్కులపై చర్యలు

Oct 1 2025 10:43 AM | Updated on Oct 1 2025 10:43 AM

భూ అక్రమార్కులపై చర్యలు

భూ అక్రమార్కులపై చర్యలు

ఆదిలాబాద్‌టౌన్‌: భూ అక్రమార్కులపై కఠినచర్యలు తప్పవని ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల భూములు కబ్జాకు యత్నించిన అట్రాసిటీ కేసు నిందితుడు ఉష్కం రఘుపతిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇదివరకు అతడు పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. మావల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మావలకు చెందిన దళితుల భూముల స్వాధీనం, బెదిరింపు కేసులో నిందితుడైన అతడిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మావలకు చెందిన బాధితులు ఏరే గంగన్న, ఏరే లక్ష్మి అసైన్డ్‌ భూములను రఘుపతికి తాకట్టు పెట్టి రూ.18లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. భూములు సాగు చేసుకునేందుకు అప్పు తీర్చేందుకు వచ్చినప్పుడు నిందితుడు కొంతమందితో కలిసి అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌తో తొక్కిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై ఇప్పటికే మావల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉందని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడం, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నట్లు వివరించారు.

అమెరికాలో ‘సద్దుల’

బతుకమ్మ సంబురాలు

మామడ: బతుకమ్మ పండుగ ఎల్లలు దాటింది. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన తెలుగువారు ఏళ్లు గడిచినా తమ ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోలేదు. లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన దాసారం తరుణ్‌–మానస దంపతులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా అమెరికాలోని నార్త్‌ కరోలినాలో విధులు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాల కోసం గా ర్నర్‌గల్లీ సంఘం ఏర్పాటు చేసి ఏటా బతుక మ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తె లిపారు. మంగళవారం ఆ ప్రాంత మేయర్‌ బడ్డి గుప్టన్‌ ముఖ్య అతిథిగా హాజరై పండుగ విశిష్టత గురించి తెలుసుకున్నారు.

ఉద్యోగ విరమణ పొందిన వారికి సన్మానం

మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన వారిని అదనపు డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందిన వారంతా తమ శేష జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు. ఉద్యోగ విరమణ పొందిన ఆర్‌.శ్రీహరి (ఆర్‌ఎస్సై), బీ భాస్కర్‌ (ఏఎస్సై), కే రమేశ్‌ (ఏఎస్సై), సీహెచ్‌ లక్ష్మ య్య (హెడ్‌ కానిస్టేబుల్‌) ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు దామోదర్‌, శ్రీనివాస్‌, వామనమూర్తి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement