
చిత్తగూడలో సమస్యల పరిశీలన
నార్నూర్: గ్రామ సమస్యలు పరిష్కరించకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని మండలంలోని చిత్తగూడ గ్రామస్తులు సోమవారం ఉమ్రీ వాగు వద్ద నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ‘సమస్యలు పరిష్కరించాలి’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. చిత్తగూడ సమస్యలపై ఆరా తీశారు. వెంటనే గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పీఆర్ డీఈఈ లింగన్న మంగళవారం చిత్తగూడ గ్రామాన్ని సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై ఉన్న చిన్న కల్వర్టుతో పాటు తెగి పోయిన రోడ్డు, వానాకాలం వస్తే రాకపోకలకు అ డ్డుగా ఉన్న వాగుపై వంతెన నిర్మాణాన్ని పరిశీలించారు. 2016–17లో రూ.25లక్షలతో వంతెన నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో పనులు మధ్యలో రద్దు అయినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాగుపై వంతెన నిర్మాణానికి రూ.50లక్షలు, రోడ్డు నిర్మాణానికి రూ.30లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.