
‘ఎల్లంపల్లి’ 43 గేట్ల ఎత్తివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో ఎంత ఉందో అంతే స్థాయిలో అవుట్ ఫ్లో ఉంది. ప్రాజెక్ట్‌లోని 43 గేట్ల ఎత్తివేసి దాదాపు 5 టీఎంసీలకు పైగా వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఆదివారం రాత్రి వరకు ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్‌కు 145.50 మీటర్లు ఉండగా 20.175 టీఎంసీలకు గాను 13.825 టీఎంసీలతో ఉంది. ఇన్‌ఫ్లో కింద ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షలు, ఎస్సారెస్పీ నుంచి 4.50 లక్షలు, కడెం నుంచి 5 వేలు మొత్తం 6.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో కింద హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ పథకానికి 303 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. 43 గేట్లు తెరవడంతో 6.60 లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నారు.