
బావి నీటితో అనారోగ్యం!
నార్నూర్: మండల కేంద్రంలోని జీన్‌గూడ(ఆదర్శనగర్), ఈద్గానగర్ కాలనీవాసులు కొందరు వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారిన పడిన ఘ టన శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని జీన్‌గూడ (ఆదర్శనగర్), ఈద్గానగర్ కాలనీవాసులు గత 15 ఏళ్లుగా జీన్‌గూ డ గ్రామ సమీపంలో ఉన్న బావి నీటిని తాగుతున్నారు. ఈక్రమంలో గత మూడు రోజులుగా వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. శుక్రవారం వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జీన్‌గూడకు చెందిన బాబాఖాన్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ రాజర్షిషా దృష్టికి సమస్య తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఎంపీవో సాయిప్రసాద్‌కు ఫోన్ చేసి సమస్యపై ఆరా తీశారు. అనారోగ్యానికి గల కారణాలు, బావి నీటిని క్లోరినేషన్ చేశారా? లేదా? వంటి అంశాలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. డీఎల్‌పీవో ప్రభాకర్, ఎంపీడీవో గంగాసింగ్, ఎంపీవోలు జీన్‌గూడ, ఈద్గానగర్ కాలనీలతో పాటు బావిని సందర్శించారు. బావి నీ టిని పరీక్షల నిమిత్తం ఉట్నూర్‌కు పంపించారు. రిపోర్టు ఆధారంగా బావి నీటితో సమస్య లేనట్లుగా తెలుస్తోంది. మరిన్ని రిపోర్టులు శనివారం రానున్నాయి. ప్రస్తుతం వాంతులు, విరేచనాలు అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.