
కుళ్లిన కోడిగుడ్లేనా..!
అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం సరఫరా
ఆందోళనలో తల్లిదండ్రులు
పోషణ మాసోత్సవం సమయంలోనే నాణ్యతలేనివి పంపిణీ
వివరాలు
అంగన్‌వాడీ కేంద్రాలు : 969
గర్భిణులు : 4.245
బాలింతలు : 3,186
చిన్నారులు : 39,229
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందకుండా పోతోంది. ఓ వైపు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వరకు పోషణ మాసోత్సవాన్ని జిల్లా శిశు, మహిళా, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. మరోవైపు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ప్రజలకు వివరిస్తూనే నాసిరకం కోడిగుడ్లు అందిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని కోటపల్లి మండలం రాపనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కుళ్లిన కోడిగుడ్లు అందజేశారు. అంగన్‌వాడీ టీచర్లు వారికి వచ్చిన ఓటీపీని చెప్పి కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చిన్న పరిమాణంలో ఉన్నా, నాణ్యత లేకున్నా తీసుకుని లబ్ధిదారులకు అందిస్తుండడం, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల వయస్సు పైబడిన చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పప్పు, ఆకుకూరలు, కోడిగుడ్డుతో కూడిన పౌష్టికాహార భోజనాన్ని మధ్యాహ్నం తింటున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు 16 కోడిగుడ్లు, బాలామృతం ఇంటికే ఇస్తున్నారు. కోడిగుడ్లు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఉడకబెట్టగా దుర్వాసన వస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని గుడ్లు తినడం వల్ల చిన్నారులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. కాంట్రాక్టర్ నాసిరకమైన, చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లు సరఫరా చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
కాంట్రాక్టర్ మార్పుతోనైనా మారేనా..!
ప్రస్తుతం కోడిగుడ్లను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ల స్థానంలో ఇటీవల ప్రభుత్వం టెండర్లు నిర్వహించి కొత్తవారికి కేటాయించింది. అంగన్‌వాడీ కేంద్రాలకే కాకుండా, జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు అప్పగించగా, మరికొద్ది రోజుల్లోనే నూతన కాంట్రాక్టర్ నుంచి సరఫరా జరగనుంది. ప్రస్తుత కాంట్రాక్టర్ నాసిరకం కోడిగుడ్లు సరఫరా చేయకుండా నియంత్రించి, కొత్త కాంట్రాక్టర్ నాణ్యతతో కూడినవి సరఫరా చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నిబంధనల మేరకు ఉన్న కోడిగుడ్లనే టీచర్లు తీసుకోవాల్సి ఉండగా, జిల్లా అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటేనే సాధ్యమవుతుంది.

కుళ్లిన కోడిగుడ్లేనా..!