
మంచిర్యాలలో చెడ్డి గ్యాంగ్ స్వైర విహారం
మంచిర్యాలక్రైం/నస్పూర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆరుగురుతో కూడిన చెడ్డి గ్యాంగు ముఠా మంగళవారం అర్ధరాత్రి స్వైరవిహారం చేసింది. సీసీసీ పోలీసుస్టేషన్ పరిధిలోని విలేజ్ నస్పూర్‌లో ఓ ఇంట్లో చోరీ చేసి అక్కడి నుంచి మంచిర్యాలలోని సాయికుంట, గోదావరివాడలో రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. మరో ఇంట్లో చోరీకి యత్నించే క్రమంలో పోలీసులు వారి వ్యూహాన్ని తిప్పికొడుతూ పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక సాయికుంట వైపు నుంచి విలేజ్ నస్పూర్‌లో ప్రవేశించిన ముఠా నస్పూర్‌లోని వినూత్న కాలనీకి చెందిన మోండె దేవక్క ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి సాయికుంట, గోదావరివాడ ప్రాంతంలో రెండిళ్లలో రెండు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. స్థానికులు గమనించి 100 డయల్‌కు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్‌రావు, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరివాడలో మరో ఇంట్లో దొంగతనానికి యత్నించగా.. అప్పటికే గాలిస్తున్న పోలీసులను చూసి పారిపోవడం గమనార్హం. పోలీసులు గాలిస్తుండగా కొందరు వ్యక్తులు చెడ్డీలు వేసుకుని తారసపడగా అనుమానితులను విచారించి వదిలేసినట్లు తెలిసింది. పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో మరిన్ని ఇళ్లలో దొంగతనాలను నివారించగలిగారు. రాత్రి, పగలు అనుమానితులు కాలనీల్లో కనిపిస్తే వెంటనే 100 డయల్‌కు సమాచారం అందించాలని డీసీపీ భాస్కర్ తెలిపారు.