
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తాం
తుడుందెబ్బ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి అధ్యక్షుడు అరుణ్‌కుమార్
ఇంద్రవెల్లిలో ఆదివాసీల భారీ ర్యాలీ
ఇంద్రవెల్లి: చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు మండలకేంద్రంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ముందుగా ఇంద్రవెల్లి, సిరికొండ మండలాలకు చెందిన తొమ్మిది తెగల వారు పాదయాత్రగా స్థానిక అమరవీరుల స్తూపం వరకు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి ర్యాలీగా చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుందెబ్బ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ మాట్లాడారు. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులన్నారు. 1976 అనంతరం లంబాడాలు అప్పటి ప్రభుత్వాలను మోసం చేసి ఎస్టీ జాబితాలో చేరారని ఆరోపించారు. వారిని వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, లేని పక్షంలో రాయిసెంటర్ సార్‌మేడీలతో చర్చించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ, చట్ట బద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు శాంతియుత ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుర్క బాపూరావ్, జిల్లా అధ్యక్షుడు దాదిరావ్, రాయిసెంటర్ జిల్లా సార్‌మేడి మెస్రం దుర్గు, ఆదివాసీ తొమ్మిది తెగల సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఆర్క ఖమ్ము, పెందోర్ పుష్పరాణి, సోయం భీంరావ్, కోవ దౌలత్‌రావ్, కుడే కై లాస్, విష్ణు, భీంరావ్, రాయిసెంటర్ సార్‌మేడీలు, ఆదివాసీలు పాల్గొన్నారు.