
భూములున్నా అడవి కొడుతున్నారు..
జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్, ఇందన్‌పల్లి రేంజ్, కవ్వాల్ సెక్షన్ సొనాపూర్ తండా పాలాఘోరీ ప్రాంతంలో అక్రమంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ గిరిజనులకు ఇప్పటికే వారి పేరిట లావణి పట్టా భూములు, ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములున్నాయని, అయినా అడవి కొడుతున్నారని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ తెలిపారు. బుధవారం జన్నారం అటవీ డివిజన్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరి పేరున 10 నుంచి 20 ఎకరాల వరకు లావణి పట్టా, ఆర్‌వోఎఫ్‌అర్ కింద భూములున్నాయని తేలిందని అన్నారు. నార్నూర్ మండలానికి చెందిన ఆత్రం భీంరావుకు లావణి పట్టా కింద 24.08 ఎకరాల భూమి ఉందన్నారు. సిర్పూర్ యూ మండలం పంగిడికి చెందిన ఆత్రం జంగుబాయి పేరున 10.15 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇలా 15 మంది వివరాలు సేకరించామని, వీరిలో ముగ్గురి పేరున ఆర్‌వోఎఫ్‌ఆర్ హక్కు పత్రాలు, మిగతా 12 మంది పేరున లావణి పట్టాలున్నాయని తెలిపారు. ఇప్పటికే 26 మందిని అరెస్ట్ చేశామని, చట్ట విరుద్ధంగా అడవిలోనే ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెంటనే అడవి నుంచి ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాలని సూచించారు.