
రిజర్వేషన్లు కొలిక్కి..!
ఆయా కేటగిరీల వారీగా ఖరారు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనే తరువాయి పోటీ చేసే అవకాశాలపై ఆశావహుల ఆరా లీకులతో నాయకుల్లో ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో స్థానిక నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. పోటీకి రిజర్వేషన్ అనుకూలతపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా స్థానాలకు ఏ రిజర్వేషన్ ఖరారైందో తెలుసుకూంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు జిల్లా అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం లేదు. అయితే ఏ స్థానం ఏ వర్గాలకు కేటాయింపు జరిగిందోనని ఆతృతతో నాయకులు తమకు తెలిసిన వారితో ఆరా తీస్తున్నారు. మొదట అధికారులు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా గణాంకాలను సైతం పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీతోపాటు బీసీ, జనరల్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేశారు.
రాష్ట్రం, జిల్లా, గ్రామం యూనిట్లుగా..
రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాలకు రిజ ర్వేషన్లు ఖరారవుతాయి. అంటే రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్‌లు వర్గాల వారీగా జిల్లాకు ఆయా రిజ ర్వేషన్ అమలవుతుంది. ఇక జిల్లా యూనిట్‌గా జెడ్పీటీసీ, మండలం యూనిట్‌గా ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామం యూనిట్‌గా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గతంలో స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్ పరిమితం ఎత్తేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం 70శాతానికి పెంచింది. ఈ క్రమంలో 42శా తం బీసీలు, ఎస్సీ 18శాతం, ఎస్టీ 10శాతం అమలు చేయనున్నారు. ఇక మొత్తం స్థానాల్లో కచ్చితంగా మహిళలకు 50శాతం కేటాయిస్తారు. అంటే 8 జెడ్పీటీసీ, 65 ఎంపీటీసీ, 153 సర్పంచ్, 1340 వార్డు స్థానాలు మహిళలకు రిజర్వు అవుతాయి. ఈ ఎన్నికల నుంచే బీసీలకు 42శాతం అమలు నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు గతంలో కంటే రాజకీయంగా అవకాశాలు మెరుగుపడనున్నాయి.
కేటగిరీల వారీగా చూస్తే..
జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాల్లో ఆరు బీసీలకు, 3 ఎస్సీలకు, ఒకటి ఎస్టీ, మిగతా ఆరు స్థానాలు జనరల్‌కు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఎంపీపీ స్థానాలు ఇదే తీరుగా ఉండనుండగా, ఎంపీటీసీలు బీసీలకు 54, ఎస్సీలకు 23, ఎస్టీలకు 12, జనరల్‌కు 40స్థానాలు దక్కనున్నాయి. అలాగే సర్పంచ్ స్థానాల్లో 128స్థానాలు బీసీలకు, 55స్థానాలు ఎస్సీలకు, 30స్థానాలు ఎస్టీలకు, 93స్థానాలు జనరల్ కేటగిరీలకు అవకాశం రానుంది. అలాగే 1125వార్డులు బీసీలకు, 482 ఎస్సీలకు, 268 ఎస్టీలకు, 805 స్థానాలు జనరల్‌కు రిజర్వు అయ్యే అవకాశం ఉంది.
లీకులతో నాయకుల్లో ఆందోళన
జిల్లా స్థానిక సంస్థలకు రిజర్వేషన్ల ఖరారు కావడంతో సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆయా మండలాలు, గ్రామాలకు కేటగిరీల వారీగా రిజర్వేషన్లు అయినట్లు మెసేజ్‌లు, పోస్టులు పెడుతున్నారు. దీంతో తమ గ్రామం, మండలంలో ఆయా వర్గాలకు అవకాశం వచ్చిందా? అన్నట్లుగా ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఉత్కంఠ ఆగలేక రెవెన్యూ, పంచాయతీ, స్థానిక అధికారులతో తెలుసుకుంటున్నారు. కొంతమంది అధికారులు నాయకులకు సన్నిహితంగా ఉన్న వారితో రిజర్వేషన్ల సమాచారం బయటకు లీకులు ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. అయితే తమ వర్గాలకు రిజర్వేషన్ రాకపోయేసరికి కొందరు నిరాశపడుతున్నారు.