
పేదరికాన్ని జయించి.. గ్రూప్–1 విజేతగా..
బెల్లంపల్లి: తల్లిదండ్రుల రెక్కల కష్టం తప్ప మరే ఆధారం లేని కుటుంబం.. అయినా ఆ యువకుడు నిరూత్సాహ పడలేదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, చదువుకు పేదరికం అడ్డు కాదని బెల్లంపల్లి మండలం బుధాకుర్థు గ్రామానికి చెందిన కొత్తూరు సత్యనారాయణ మూర్తి భావించాడు. పట్టుదలతో చదివి బుధవారం వెలువడిన టీజీపీఎస్‌సీ గ్రూప్–1 ఫలితాల్లో 280వ ర్యాంకుతో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(సీటీవో)గా ఉద్యోగం సాధించాడు.
శిక్షణ తీసుకోకుండానే..
సత్యనారాయణమూర్తి పదో తరగతి సెయింట్ మెరీస్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ ప్రగతి జూనియర్ కళాశాలలో, డిగ్రీ హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలో పూర్తి చేశాడు. ప్రస్తుతం కేవీ రంగారెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మేనమామ మోకెనపల్లి శ్రీనివాస్ ప్రేరణతో డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే రోజుకు ఏడు గంటలు చదువుతూ సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగానే సివిల్ సర్వీస్ పరీక్ష రాశాడు. అందులో ఫెయిల్ కావడంతో పరీక్షపై అవగాహన పెంచుకున్నాడు. రెండోసారి ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించినా మెయిన్స్‌లో తప్పాడు. అయినా నిరాశ చెందకుండా మూడోసారి ప్రిలిమ్స్ ఉత్తీర్ణుడై మెయిన్స్ పరీక్ష రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో టీజీపీఎస్‌సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ అయింది. పరీక్ష రాసిన మూర్తి సీటీవో అయ్యాడు.
కొడుకు చదువు కోసం..
కొత్తూరు లక్ష్మి, శ్రీనివాస్ దంపతులకు ఏకై క సంతానం సత్యనారాయణమూర్తి. తండ్రి ప్రైవేటు ప్లంబర్‌గా పని చేస్తుండగా..తల్లి గృహిణి. శ్రీనివాస్ కొంతకాలం బెల్లంపల్లి మున్సిపాల్టీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా ప్లంబర్ పనులు చేశాడు. కొడుకును ఉన్నతంగా చదివించాలనే లక్ష్యంతో కొన్నాళ్ల క్రితం ఆ దంపతులు స్వగ్రామాన్ని వీడి కొడుకుతోపాటు హైదరాబాద్‌కు వెళ్లారు.
ఐఏఎస్ కావడం జీవితాశయం
నా చిన్నతనం నుంచి పేదరికాన్ని చవి చూశాను. నా చదువు కోసం అమ్మనాన్న పడిన కష్టాలు గమనించాను. గొప్పగా చదువుకుంటే ఉన్నతమైన ఉద్యోగం సాధించవచ్చని నా మేనమాన చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తు ఉన్నాయి. అందుకనే చిన్నతనం నుంచే ఐఏఎస్ కావాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాను. ఆ లక్ష్యసాధనలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న క్రమంలో అనూహ్యంగా గ్రూప్–1 ఉద్యోగం వచ్చింది. అయినా సరే సివిల్స్ పరీక్ష పాసై కలెక్టర్ అవుతాను.
– సత్యనారాయణమూర్తి