
వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన
మంచిర్యాలక్రైం: అక్రమంగా తమ భూమి కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ కుటుంబం మంగళవారం జిల్లా కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. మ్యాదరివాడకు చెందిన బొలిశెట్టి మల్లక్కకు ఇద్దరు కుమారులు మహేశ్, రాజేశ్ ఉన్నారు. మల్లక్క మూగ, రాజేశ్ మానసిక పరిస్థితి బాగోలేదు. మల్లక్క, రాజేశ్ పేరుమీద హాజీపూర్ మండలం దొనబండ శివారులో, సబ్బపల్లి శివారులో 4 ఎకరాల17 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని మంచిర్యాలకు చెందిన బొలిషెట్టి సావిత్రి, ముధం శ్రీలత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మహేష్ ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు, హాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆర్నెళ్లుగా పట్టించుకోవపోవడంతో మహేష్, అతని భార్య కీర్తన, కుమారుడు చంద్రశేఖర్‌తో కలిసి వాటర్ ట్యాంకు ఎక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగారు.