మంచిర్యాలటౌన్: జిల్లాలో వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాసిపేట మోడల్ స్కూల్‌లో వీధి కుక్కలు చి న్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం, బెల్లంపల్లి కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయడం తెలిసిందే. కుక్కకాటు బాధితుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం, పారిశుద్ధ్యం మెరుగుపర్చకపోవడంతో బెడద పెరిగిపోతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 15వరకు జిల్లాలో 771 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.
శస్త్రచికిత్సలతోనే సరి
మంచిర్యాల నగరంలో కుక్కల సంతతి నియంత్రణకు శస్త్రచికిత్స కోసం ఎనిమల్ కేర్ సెంటర్‌ను ఆండాళమ్మ కాలనీలో ఏర్పాటు చేశారు. కొన్నాళ్లపాటు శస్త్రచికిత్సలు చేసినా ఆ తర్వాత కొన్ని కారణాలతో నిలిపివేశారు. ఇటీవల మళ్లీ చేస్తున్నా ఎక్కడి నుంచి తీసుకొస్తున్న కుక్కలను శస్త్రచికిత్స అనంతరం అక్కడే వదిలేస్తున్నారు. సంతతి నియంత్రణకు ఆపరేషన్ చేస్తున్నా.. ఇప్పటికే వీధి కుక్కల సంఖ్య ఎ క్కువగా ఉండడంతో ప్రజలపై దాడి చేస్తున్నాయి. జంతు కళేబరాలను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల మాంసానికి అలవాటు పడుతున్నాయి. వెర్రి లేచిన కుక్కలు తిరుగుతుండడం, వాటిని ఎవరూ పట్టుకోకపోవడంతో ఒకదాని నుంచి మరోదానికి వ్యాధి సోకి ప్రజలను కరుస్తున్నాయి.
నగరంలో మరీ ఎక్కువ
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏ వీధిలో చూసినా 20కి పైగా కుక్కలు సంచరిస్తూ కనిపిస్తాయి. శివారు ప్రాంతాల్లో మాంసం వ్యర్థాలు వేస్తుండడంతో వాటి సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల నగరం నడిబొడ్డున ఉన్న హైటెక్‌సిటీ కాలనీలో శునకాల బెడద ఎక్కువైంది. ఫేస్–2లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా, ఖాళీ ప్లాట్లు ఎక్కువగా ఉన్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా మందుబాబులు ఖాళీ ప్లాట్లను అడ్డాగా మార్చుకుంటున్నారు. వెంట తెచ్చుకున్న ఆహారాన్ని అక్కడే పడేస్తుండడం, జంతు కళేబరాలు సైతం ఈ ప్రాంతంలో వేస్తుండడంతో కుక్కల బెడద పెరిగింది. రాజీవ్‌నగర్ వాసులు వందలాది మంది హైటెక్‌సిటీ కాలనీ నుంచి మంచిర్యాలకు వచ్చి పనులు చేసి వెళ్తుంటారు. మహిళలు హైటెక్‌సిటీ కాలనీ, మారుతినగర్, వికాస్‌నగర్, లక్ష్మీనగర్ కాలనీల్లోని ఇళ్లల్లో పనులకు వస్తుంటారు. కుక్కలు వెంట పడుతుండడంతో గుంపులుగా కలిసి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు కుక్కల బెడద నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో గత ఐదేళ్లలో
కుక్కకాటుకు గురైన వారు
సంవత్సరం బాధితులు
2021 2,168
2022 1,685
2023 2,277
2024 687
2025 771