
● నేటి నుంచి ప్రత్యేక బస్సులు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగ
దసరాకు ఆర్టీసీ ‘స్పెషల్’
ఆదిలాబాద్/మంచిర్యాలఅర్బన్: బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు వచ్చే వారి కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 414 సర్వీసులు నడపాలని నిర్ణయించింది. నేటి నుంచి అక్టోబర్ 1వరకు నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది.
నేటి నుంచి షురూ..
పాఠశాలలకు ఈనెల 21నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శని, ఆది రెండు రోజుల్లో విద్యార్థులు తమ సొంత ఊళ్ల బాట పట్టనున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఉమ్మడి జిల్లాకు చేరుకోనుండడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈనెల 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న దసరా పండుగలున్నాయి. తదనుగుణంగా బస్సులు నడిపేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రీజియన్ వ్యాప్తంగా మొత్తం 414 బస్సులను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా నడిపేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1వరకు రీజియన్ పరిధిలోని బస్సులు ఎంజీబీఎస్ నుంచి కాకుండా జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఆదిలాబాద్‌లోని వివిధ డిపోలకు నడపనున్నారు. అలాగే అక్టోబర్ 5, 6 తేదీల్లో తిరుగు ప్రయాణం దృష్ట్యా రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రయాణికులపై అదనపు వడ్డన..
ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ పెరిగింది. టికెట్ తీసుకున్న పురుష ప్రయాణికులు చాలా చోట్ల నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి. తాజాగా పండుగల వేళ స్పెషల్ బస్సుల్లోనూ రద్దీ ఉండనుంది. దీనికి తోడు ప్రత్యేక సర్వీసుల్లో ఏకంగా 50 శాతం అదనపు చార్జీ అమలుకు సంస్థ నిర్ణయించింది. దీంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. గతంలో సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని వంటి సర్వీసుల్లోనే అదనపు చార్జీలు వసూలు చేసిన సంస్థ ఈసారి పల్లె వెలుగు సర్వీసుల్లో కూడా అదనపు వడ్డనకు రంగం సిద్ధం చేసింది.
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా..
పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం శనివారం నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఒకే చోట 50 మంది విద్యార్థులు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో మేనేజర్లను సెల్ నంబర్లలో సంప్రదిస్తే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో (99592 26002), నిర్మల్( 99592 26003), భైంసా(99592 26005), ఆసిఫాబాద్ (99592 26006) మంచిర్యాల (99592 26004) నంబర్లలో సంప్రదించవచ్చు.
రిజర్వేషన్ ఇలా..
పండగల దృష్ట్యా రిజర్వేషన్ చేసుకోవాలనే ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.