
పోడు కోసం చెట్ల నరికివేత
జన్నారం: ఆదివాసీలు, అటవీశాఖ పోరులో విలువైన టేకు చెట్లు నేలకొరుగుతున్నాయి. ఆదివాసీ గిరిజనులు అడవిలో తిష్టవేసి చెట్లు నరికి భూమి చదును చేసేందుకు యత్నిస్తున్నారు. అడ్డు వెళ్లిన ఇద్దరు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కవ్వాల్ టైగర్‌జోన్, జన్నారం అటవీ డివిజన్, ఇందన్‌పల్లి రేంజ్, కవ్వాల్ అటవీ సెక్షన్, సోనాపూర్ తండా బీట్‌లోని పాలఘోరీల ప్రాంతంలో 40రోజులుగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్, లింగపూర్ మండలాలకు చెందున సుమారు 100మంది ఆదివాసీ గిరిజనులు ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. తమ పూర్వీకులకు చెందిన భూమి ఈ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు. తమ వద్ద సదరు భూమికి సంబంధించిన కాగితాలున్నాయని, అందుకే ఈ భుమి తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు వేర్వేరుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ భూమి అటవీశాఖకు సంబంధించిందని, ఈ భూమిపై ఆధారాలుంటే కలెక్టర్ లేదా రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లాలని సూచించారు. అయినా వినకుండా, 20రోజుల క్రితం సుమారు 150టేకు చెట్లు నరికివేశారు. అప్పుడు 30మందిపై కేసు నమోదు చేశారు.
మరో 150వరకు చెట్ల నరికివేత
అధికారుల కౌన్సిలింగ్ అనంతరం కొన్ని రోజులు నిశబ్దంగా ఉన్న ఆదివాసీ గిరిజనులు గురువారం రాత్రి వారుంటున్న అటవీ ప్రాంతం పరిసరాల్లో సుమారు 150 చెట్లు నరికివేశారు. అడ్డు వెళ్లిన బీట్ అధికారి ప్రణయ్, బేస్‌క్యాంపు వాచర్ వెంకటకృష్ణపై దాడికి పాల్పడ్డారు. వారిని అక్కడ నుంచి కర్రలతో తరిమేశారు. దీంతో భయంతో వారు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఇందన్‌పల్లి రేంజ్ అధికారి శ్రీధర్‌చారి, సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. పడిపోయిన చెట్ల వివరాలు సేకరించారు. చిన్నవి, పెద్దవి కలిసి సుమారు 150కి పైగా చెట్లు నరికివేసినట్లు తెలిపారు.
50మందిపై కేసు నమోదు
పాలఘోరీల ప్రాంతంలోని అడవిలో చెట్లు నరికివేయడమే కాకుండా అటవీ సిబ్బందిపై దాడికి పాల్ప డిన 50మంది ఆదివాసీ గిరిజనులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అడవిలో చెట్లు నరికివేయడమే కాకుండా ఇద్దరు సిబ్బందిపై దాడి చేశారని కవ్వాల్ డిప్యూటీ రేంజ్ అధికారి విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 50మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనూష తెలిపారు.
చెట్లు నరకడం సరికాదు
టైగర్‌జోన్ కోర్ ప్రాంతమైన పాలఘోరీల వద్ద ఎక్కడి నుంచో వచ్చి విలువైన టేకు చెట్లు నరికివేయడం సరికాదు. గతంలో కూడా 150 చెట్లు నరికివేశారు. గురువారం కూడా మరోసారి చెట్లు నరకడం దారుణం. చట్టప్రకారం వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తాం. భూమికి సంబంధించిన పత్రాలుంటే చట్టప్రకారం అధికారులను కలిసి సమస్య పరిష్కరించుకోవాలి. కానీ.. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారీతిన చెట్లు నరకడం సరికాదు.
– రామ్మోహన్, ఎఫ్‌డీవో