
35శాతం వాటా చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల నుంచి 35శాతం వాటా కార్మికులకు చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం లాభాల వాటా చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారని తెలిపారు. దసరా పండుగ సమీపిస్తున్నా ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో ప్రకటించలేదన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించి నెల గడుస్తున్నా లెక్కతేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. స్ట్రక్చరల్ సమావేశాల ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు ఇవ్వకుంటే సమ్మెకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం అధికారులను కలిసి మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, మైనింగ్ స్టాఫ్ రీజియన్ కార్యదర్శి వంగ రాజేశ్వరరావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.