
దసరాలోపు లాభాల వాటా చెల్లించాలి
శ్రీరాంపూర్: దసరా పండుగలోపు లాభాల వాటా చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆర్కే 7, ఎస్‌ఆర్పీ 3 గనులపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కంపెనీ సాధించిన వార్షిక లాభాలు ఇప్పటికీ ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు. దసరాలోగా లాభాల వాటా చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. లాభాల వాటా, స్ట్రక్చరల్ సమావేశ ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కంపెనీ వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం కమిటీ చర్చల ప్రతినిధి సంపత్, ఫిట్ కార్యదర్శులు మురళి చౌదరి, మారుపెల్లి సారయ్య, నాయకులు జాడి రాజకుమార్, తోట మల్లేష్, ఆడెపు సురేష్ పాల్గొన్నారు.