
ఇక ‘స్మార్ట్’ విద్యుత్!
కొత్త మీటర్లు అందుబాటులోకి..
‘ఆటోమేటిక్’ మీటర్ రీడింగ్
హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లకు బిగింపునకు చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ వినియోగదారులకు పారదర్శకత, కచ్చితమైన బిల్లింగ్ అందించేందుకు విద్యుత్ శాఖ స్మార్ట్‌మీటర్లను బిగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం హెచ్‌టీ (హైటెన్షన్) విద్యుత్ సర్వీసులు ఇండస్ట్రీస్‌కు ఈ మీటర్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మాన్యువల్ విద్యుత్ బిల్లులు అమలులో ఉండగా ఇకనుంచి విద్యుత్‌శాఖ ‘ఆటోమేటిక్ మీటర్ రీడింగ్’ (ఏఎంఆర్) వ్యవస్థను ప్రవేశపెడుతోంది. మీటర్ రీడింగ్ హైఓల్టేజ్ విద్యుత్ వాడుకునే కేటగిరీలో 55 హెచ్‌పీకి మించి సామర్థ్యం ఉంటే ఏడీఈ స్థాయి అధికారి, 55 హెచ్‌పీ లోపుఉంటే ఏఈ స్థాయి అధికారి పరిశీలిస్తున్నారు. నాన్‌స్లాబ్ రీడింగ్‌ను లైన్ ఇన్‌స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్‌ను ప్రైవేట్ బిల్లింగ్ సిబ్బంది, జూనియర్ లైన్‌మెన్లు విద్యుత్ వినియోగదారులకు మాన్యువల్ బిల్లింగ్‌లు అందజేస్తున్నారు. విద్యుత్ వినియోగంలో చౌర్యం, అక్రమాలకు పాల్పడకుండా, బిల్లుల్లో హెచ్చుతగ్గులు, తదితర సమస్యలు నెలకొంటున్న నేపథ్యంలో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్‌తో పొరపాట్లకు తావులేకుండా వేగవంతమైన బిల్లింగ్ ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏఎంఆర్ అంటే స్మార్ట్‌మీటర్ సిస్టం విద్యుత్ వినియోగాన్ని కొలిచే సాధానం. మీటర్‌లో 4జి కమ్యూనికేషన్ సిమ్ పెడుతారు. దీంతో నమోదైన ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా హన్మకొండలోని సెంట్రల్ సర్వర్‌కు చేరుతుంది. ఆ సర్వీసులో వాడుకున్న విద్యుత్ ఆధారంగా ప్రతీ 30 రోజుల్లో బిల్లు వివరాలు పరిశ్రమల యజమానుల మెయిల్‌కు లేదా ఫోన్‌కు చేరుతుంది. బిల్లు సైతం ఆన్‌లైన్ ద్వారా నేరుగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ ఆటోమేటిక్ రీడింగ్ విధానం అమల్లోకి వస్తుండగా ప్రత్యేకంగా రీడింగ్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.
మొదట 284 మీటర్లు..
జిల్లాలో మొత్తం 3,65,091 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఎల్‌టీ–3 మీటర్లు 1,483, ఉండగా (హై ఓల్టేజీ) వినియోగించే హెచ్‌టీ కేటగిరీ కనెక్షన్లు 179 ఉన్నాయి. జిల్లాలో సింగరేణితో పాటు ఎక్కువగా రైస్‌మిల్లులు, ఇటుకల తయారీ, తదితర పరిశ్రమలకు హై ఓల్టేజీ విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. వీటి ద్వారా విద్యుత్ శాఖకు నెలకు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఽఅధిక సామర్థ్యం గల విద్యుత్‌ను వినియోగించే పరిశ్రమల్లో మొదటగా (ఏఎంఆర్) విధానం అమలు చేస్తున్నారు. జిల్లాలో 284 పరిశ్రమలకు ఈ స్మార్ట్‌మీటర్ల వ్యవస్థ, ప్రతీ మీటర్‌లో 4జీ కమ్యూనికేషన్ సిమ్ అమర్చబడుతుంది. ఏఎంఆర్ విధానంతో రీడింగ్ తీసే సమయంలో చిన్నతప్పు కూడా జరిగే అవకాశం ఉండదు. విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చుతగ్గులను వెంటనే గుర్తించవచ్చు. అంతేకాకుండా సిబ్బంది సమయం వృథా కాకుండా, వినియోగదారులకు సకాలంలో బిల్లులు అందించేందుకు ఉపకరిస్తుంది.