
‘పటేల్’తోనే తెలంగాణ ప్రజలకు విముక్తి
ఇచ్చోడ: సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17న విముక్తి కలిగిందని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలు బ్రిటీష్ పాలనలోనే ఉన్నారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా ఘనంగా జరుపుకోవాలని కోరారు. దేశంలో జీఎస్టీ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కౌన్సిల్ ఏర్పాటు చేసి స్లాబ్‌లు తగ్గించడం ద్వారా అనేక రకాల వస్తువులపై ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఎంతో మందికి ప్రయోజనం కలిగిందని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం, జిల్లా ఉపాధ్యక్షుడు మాధవ్ అమ్టె, కౌన్సిల్ సభ్యుడు తాటిపెల్లి రాజు, అసెంబ్లీ కన్వీనర్ కదంబారావు, మండలాధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.