
కడ్తాల్ పెద్ద చెరువుకు గండి
సోన్: మండలంలోని కడ్తాల్ గ్రామ సమీపంలోగల పెద్ద చెరువు కట్ట మంగళవారం తెగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు తూము వద్ద క ట్ట బలహీనపడింది. దీనికి తోడు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి తూము వద్ద బుంగ ఏర్పడి కట్ట పూర్తిగా తెగిపోయింది. దీంతో చెరువులోని నీరంతా దిగువనున్న పంట పొలాల్లోకి వెళ్తోంది. గ్రామస్తులు వెంటనే నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. గత ప్రభుత్వంలో రూ.78లక్షలతో మిషన్ కాకతీయ కింద చెరువు పూడికతీత పనులు చేపట్టినప్పటికీ కట్టను పటిష్టం చేయలేదని ఆరోపించారు. భారీగా కురిసిన వర్షానికి చెరువు పూర్తిగా నిండి తెగిపోయి రైతులకు నష్టం చేకూర్చిందని పేర్కొన్నారు. నీటిపారుదలశాఖ ఈఈ అనిల్, ఏఈ మధుకర్‌ను సంప్రదించగా, సోమవారం రాత్రి కురిసిన వర్షంతో భారీగా చెరువులోకి నీరు వస్తోందని, వరద ఉధృతి తగ్గిన వెంటనే గండిని పూడ్చివేస్తామని తెలిపారు. అంతకుముందు తహసీల్దార్ మల్లేశ్‌రెడ్డి గండిని పరిశీలించారు.