పల్లెకు చేరిన సాంకేతికత | - | Sakshi
Sakshi News home page

పల్లెకు చేరిన సాంకేతికత

Sep 8 2025 4:44 AM | Updated on Sep 8 2025 4:44 AM

పల్లె

పల్లెకు చేరిన సాంకేతికత

● సాగుకు టెక్నాలజీ దన్ను ● అన్నదాత చెంతకు ఆధునిక యంత్రాలు

జన్నారం: వ్యవసాయరంగంలో కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు యాంత్రీకరణ, ఆధునిక యంత్రాలవైపు దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకు సాగు భారంగా మారడంతో అరకలకు స్వస్తి చెప్పి ట్రాక్టర్లు, వీడర్లు, డ్రోన్లు, తైవాన్‌ బ్యాటరీ స్ప్రేయర్లు, కలుపుతీత యంత్రాల కొనుగోలు వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో యంత్రాల సహాయం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎడ్లు, నాగళ్లు పోయి ట్రాక్టర్లు వచ్చాయి. పొలం చదును చేసింది మొదలు, నాటువేసి, పొలం కోసేంత వరకు రైతులు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. కొడవళ్లతో పొలం కోసి, కుప్పలు పెట్టి, తూర్పార పట్టే రోజులు పోయాయి. హార్వెస్టర్‌ ద్వారా పొలాన్ని కోయించడంతో గంటల వ్యవధిలోనే వరిధాన్యం ఇంటికి చేరుతోంది. ప్రభుత్వం జిల్లాల వారీగా విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంతో రైతులకు మరింత దన్ను లభించనుంది. ప్రభుత్వం యంత్ర పరికరాలకు రాయితీ కల్పిస్తే రైతుల్లో మరింత భరోసా పెరగనుంది.

పెరుగుతున్న యంత్రసాయం

వ్యవసాయరంగంలో రోజురోజుకూ సమూల మార్పులు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఎక్కువశాతం మంది రైతులు అత్యధికంగా పత్తి, వరి పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో 1,48,962 ఎకరాల్లో వరి, 1,60,987 ఎకరాల్లో పత్తి, 255 ఎకరాల్లో మొక్కజొన్న, 921 ఎకరాల్లో కందులు, 165 ఎకరాల్లో పెసర్లు పంటలు సాగు చేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు వ్యవసాయంలో కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు యంత్ర సహాయం తీసుకుంటున్నారు.

కలియదున్నడానికి వీడర్లు

పంటల్లో దున్నడం, జంబు కొట్టేందుకు అరకలు వాడేవారు. పశుపోషణ భారంగా మారడంతో రైతులు వీడర్లు కొనుగోలు చేస్తున్నారు. వివిధ రకాల యంత్రాలను వ్యవసాయానికి వాడుతున్నారు. వీడర్‌లో ఒక లీటర్‌ పెట్రోల్‌ తో ఎకరం భూమిని దున్నవచ్చు. దుక్కిదున్నితే లోపల మట్టి బయటకు, బ యట మట్టి లోపలికి వెళ్లి భూమి సారవంతం అవుతుంది. ఇలా చేయడం వల్ల ఎరువులు భూమిలో కలిసిపోయి పంటలకు పోషకాలు అందుతాయి.

డ్రోన్‌తో పిచికారీ

పంటలను ఆశించిన చీడపీడలను నివారించేందుకు స్ప్రేయర్లతో పిచికారీ చేయడం పాత పద్ధతి. ఇప్పుడు పంటలకు రసాయనాలు పిచికారీ చేసేందుకు డ్రోన్‌లు వచ్చేశాయి. డ్రోన్‌ ద్వారా రోజుకు 30 నుంచి 40 ఎకరాల వరకు పురుగుల మందు పిచికారీ చేయవచ్చని రైతులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రైతులకు తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో మందులు పిచికారీ చేయవచ్చు. కూలీలకు శ్రమ కూడా తగ్గుతుంది. 12 లీటర్ల సామర్థ్యం గల డ్రోన్‌ అరగంటకు ఎకరం విస్తీర్ణంలో మందులు పిచిచారీ చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. డ్రోన్‌ ద్వారా మందులు పిచికారీ చేయడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పాటు పంట చేలల్లో పాములు, తేళ్ల బారినుంచి రక్షణ పొందవచ్చు. ఒక డ్రోన్‌ రూ.5 లక్షల వరకు లభిస్తోంది. దీనిని ప్రభుత్వం రాయితీపై అందజేస్తే రైతులకు ప్రయోజనం కలగనుంది.

సౌర కంచెలు

పంటలను అడవి పందులు, కోతులు ఇతర జంతువుల భారి నుంచి కాపాడుకోవడానికి చాలామంది రైతులు సౌర పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. బ్యాటరీ సహాయంతో పొలం చుట్టూ కంచెలను ఏ ర్పాటు చేస్తున్నారు. జంతువులు, ప్రజలకు ఎలాంటి హాని లేకుండా పంటలను కాపాడుకోవచ్చు.

ఉపాధి లభిస్తోంది

డ్రోన్‌ వినియోగం గురించి జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో వారం రోజులు శిక్షణ ఇచ్చారు. నెల రోజుల క్రితం రూ.5 లక్షలు వెచ్చించి డ్రోన్‌, నాలుగు బ్యాటరీలు తీసుకున్నా. 12 లీటర్ల సామర్థ్యం గల ఈ డ్రోన్‌ పిచికారి యంత్రంతో ఒక్కసారి ఎకరం పొలానికి మందు పిచికారీ చేయవచ్చు. ఎకరాకు రూ.500 చొప్పు తీసుకుంటున్నా. పరిసర ప్రాంతాల రైతులు మందు పిచికారీ కోసం వస్తుండడంతో ఉపాధి లభిస్తోంది. – చిట్యాల నరేశ్‌, కలమడుగు

రైతుకు ప్రోత్సాహం

రైతులకు వ్యవసాయం కోసం ప్రభుత్వం వివిధ రీతుల్లో ప్రోత్సాహం అందిస్తుంది. ఇప్పటికే సబ్సిడీపై యంత్రాలను అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. నారుమడి దున్నడం నుంచి నాటు వేసే వరకు యంత్రాల వాడకం గురించి రైతులకు వివరిస్తున్నాం. మండలంలో మొదటిసారి డ్రోన్‌తో మందులు పిచికారీ చేస్తున్నారు. రైతులకు యంత్ర సాయం కోసం ప్రభుత్వం సహకరిస్తుంది. – సంగీత, ఏవో, జన్నారం

పల్లెకు చేరిన సాంకేతికత1
1/1

పల్లెకు చేరిన సాంకేతికత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement