
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
పాతమంచిర్యాల: బేవరేజస్ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హరిత ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ బేవరేజస్ వర్కర్స్ యూని యన్ 4వ రాష్ట్ర మహాసభ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సభ ప్రాంగణం వద్ద సీఐటీయూ జెండా ఎగురవేసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బేవరేజస్ కార్పొరేషన్‌లో 2 వేల మంది హమాలీ కార్మికులు పని చేస్తున్నారని, బేవరేజ్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.40 వేల కోట్ల ఆదాయం సమకూరుతోందన్నారు. ఆదాయం ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రైవేట్ గోదాములలోనే సరుకు నిల్వ చేస్తున్నారన్నారు. అందులో సరైన వసతులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వంగూరు రాములు మాట్లాడుతూ హమాలీ కార్మికులకు పనికి తగిన వేతనం, పనిస్థలాల్లో భద్రత లేదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. అధిక బరువులు మోయడం వల్ల యుక్త వయస్సులోనే రోగాల బారిన పడతున్నారని, వారికి ఆదరణ కల్పించాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, దాసరి రాజేశ్వరి, నాయకులు చల్లూరి దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.