
ఐటీడీఏ అలసత్వం!
గిరిజన అభివృద్ధికి ఆటంకం ఆరేళ్లుగా సమావేశం కాని పాలకవర్గం మీటింగ్‌పై పట్టింపులేని అధికారులు పరిష్కారానికి నోచుకోని ‘గిరి’ సమస్యలు
ఏజెన్సీలో జీవనం సాగిస్తున్న గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, వివిధ పథకాల అమలు, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు నిర్వహించే ఐటీడీఏ పాలక వర్గ సమావేశాలు జరగడం లేదు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అభివృద్ధి పనులపై సమీక్షించడం, కొత్త పనులకు తీర్మానం చేయడం వంటి వాటిపై చర్చ జరగకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు
అభివృద్ధికి నోచుకోవడం లేదు. – ఉట్నూర్‌రూరల్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. కానీ అభివృద్ధిని గురించి పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించి ఐటీడీఏ సమావేశం నిర్వహించి గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని కోరుతున్నారు.
తీర్మానాలే అత్యంత కీలకం..
గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో 1975లో ఐటీడీఏను ఏర్పాటు చేశారు. 2011 జనభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 44 ఏజెన్సీ మండలాల్లోని 250 గ్రామ పంచాయతీల్లో విస్తరించి ఉంది. ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్, సిర్పూర్ (యు), కెరమెరి, వాంకిడి, తిర్యాని గిరిజన మండలాలు ఉన్నాయి. నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్‌లో గిరిజనుల సమస్వలపై చర్చించి వారి అభివృద్ద్ధికి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. గిరిజనులతో పాటు గిరిజనేతరుల సమస్యల పరిష్కారానికి పాలకవర్గం చేసే తీర్మానాలు కీలకం. ఈ తీర్మానాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని గిరిజనుల సంక్షేమం కోసం చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఆరు సంవ త్సరాలుగా పాలక మండలి సమావేశాలు లేకపోవడంతో గిరిజనుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
వెంటాడుతున్న సమస్యలు
ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు, వంతెనలు లేక అనేక గ్రామాల గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరంగానే ఉంటున్నారు. ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రహదారులు అభివృద్ధి చేయాల్సినప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఎమర్జెన్సీ సమయాల్లో వైద్యం కోసం వెళ్లే వారు వంతెనలు, వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. ఏటా సీజనల్ వ్యాధులు, రక్తహీనత సమస్య వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు సికిల్‌సెల్ సమస్య కూడా ఉంది. ముఖ్యంగా పోడు పట్టాల సమస్యతో ఎంతోమంది ఆదివాసీలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఐటీడీఏ పాలకవర్గం ఏర్పాటుతో పాటు సమావేశం నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.

ఐటీడీఏ అలసత్వం!