
● రెవెన్యూ సదస్సుల్లో వేలాదిగా దరఖాస్తులు ● పలు కారణాలత
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూభారతి సదస్సుల్లో వచ్చిన అర్జీలు ఈ నెల 15వరకే పరిష్కరించాలని గడువు విధించగా.. జిల్లాలో ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అధికారుల పని ఒత్తిడి, సిబ్బంది లేమితో పరిష్కారానికి జాప్యం జరుగుతోంది. గ్రామ స్థాయిలో వీఆర్వోలు లేక పరిశీలనలు సాగడం లేదు. దీంతో మరికొంత గడువు కావాలని ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు విన్నవించారు. ఈ క్రమంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గత జూన్‌లో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఒక్కో గ్రామం నుంచి వేలాది దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 16,871 అర్జీలు వచ్చాయి. వీటిలో సాదాబైనామా, అసైన్డ్ ల్యాండ్ మొదటి దశలోనే తిరస్కరించారు. మిగతా వాటిని సమస్యల వారీగా గుర్తిస్తూ పరిశీలించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 17 మండలాల్లో 366 రెవెన్యూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బృందాలు ఇందుకోసం గత రెండు నెలలుగా పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనేక కారణాలతో ఆశించిన మేర అర్జీలకు పరిష్కారం దొరకడం లేదు.
పరిష్కరించినవి 2వేలకుపైన
సాదాబైనామా, అసైన్డ్ హక్కుల సమస్యలు మినహా దరఖాస్తులను గుర్తించి పరిష్కారానికి చొరవ చూ పారు. వీటిలో మిస్సింగ్ సర్వేనంబర్లు, మ్యూటేషన్/కోర్టు కేసులు, డిజిటల్ సైన్ పెండింగ్, భూ విస్తీర్ణ హెచ్చుతగ్గులు, భూ రకం మార్పు, పట్టాదారు పేరు మార్పు, నిషేధిత ఖాతా, ఖాతా మెర్జింగ్, ఆర్‌ఎస్‌ఆర్ మార్పు, అప్పీళ్లు, కోర్టు కేసులు, ఇతర సమస్యలపై అర్జీలు వచ్చాయి. వీటిలో అధికంగా సర్వే నంబరు మిస్సింగ్, వారసత్వ, డిజిటల్ సంతకానికి సంబంధించిన అర్జీలు వచ్చాయి. వీటిలో కొన్నింటిని పరిశీలించి నోటీసులు ఇచ్చి పరిష్కారం చూపారు. ఇంకా కొన్ని రకాల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు అధికారులు ఆమోదించి పరిష్కరించినవి 2138 ఉండగా.. ఇంకా వెయ్యి వరకు పరిశీలించాల్సి ఉన్నాయి. వీటిలో రెండు నుంచి మూడు వందల వరకు సమస్యల పరిష్కారానికి వీలయ్యే అవకాశం ఉంది. మిగతావన్నీ మళ్లీ పెండింగ్‌లోనే ఉండే అవకాశం ఉంది. కోర్టు కేసులు, హెచ్చుతగ్గులు, వారసత్వ తగాదాలు వంటివి ఉన్నాయి. నిషేధిత జాబితాలో ప్రభుత్వ, అటవీ, పలు రకాల భూములు ఉండడంతో ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించడం వంటి అర్జీలు ఉన్నాయి. దీంతో భూభారతి చట్టం అమలుకు ముందు ఇంకా జిల్లాలో అపరిష్కృతంగా అర్జీలు ఉండే అవకాశం ఉంది. గతంలో ధరణి చట్టంలోనూ ఇదే తీరుగా సమస్యలు కొనసాగాయి. తాజాగా భూ భారతి అమలులోనూ కొన్ని అర్జీలు అలాగే మిగిలిపోయే అవకాశం ఉంది.

● రెవెన్యూ సదస్సుల్లో వేలాదిగా దరఖాస్తులు ● పలు కారణాలత