
కట్టెల పొయ్యిలపైనే ‘మధ్యాహ్నం’ వంట
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి గ్యాస్ కనెక్షన్ల మంజూరుపై ప్రతిష్టంభన నెలకొంది. కట్టెల పొయ్యిల స్థానంలో ఎల్‌పీజీ గ్యాస్‌ను వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, నిర్వహణ ఖర్చులపై స్పష్టత లేకపోవడంతో వంట ఏజెన్సీలు ఆర్థిక భారం మోయలేమంటూ విముఖత చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆగస్టు 15 నాటికి అన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరలేదు.
ఖర్చు భారం, నిధుల కొరత..
ఒక గ్యాస్ కనెక్షన్, పొయ్యి కొనుగోలుకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతుంది. అదనంగా, మూడు సిలిండర్‌ల కొనుగోలుతో కలిపి ఏజెన్సీలకు రూ.11 వేల నుంచి రూ.12 వేలు కావాలి. ప్రభుత్వం కనెక్షన్లు, పొయ్యిలు సమకూర్చినప్పటికీ, నెలవారీ గ్యాస్ సిలిండర్ కొనుగోలుకు నిధులపై స్పష్టత లేదు. ఒక పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నెలకు సగటున 15 సిలిండర్లు అవసరమవుతాయి. దీనికి సుమారు రూ.15 వేలు కావాలి. ఇప్పటికే మధ్యాహ్న భోజన సరుకులు, కూరగాయలు, కోడిగుడ్ల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో, ఏజెన్సీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. గ్యాస్ సిలిండర్ ఖర్చు కట్టెల పొయ్యిల కంటే ఎక్కువ కావడం వారిలో ఆందోళనను మరింత పెంచుతోంది.
అవే ఆధారం..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా మంజూరు చేసినప్పటికీ, నెలవారీ సిలిండర్ సరఫరాకు నిధులు అందించకపోతే, పాఠశాలలు మళ్లీ కట్టెల పొయ్యిలపై ఆధారపడే పరిస్థితి తలెత్తనుంది. కట్టెల పొయ్యిలతో భోజనం నాణ్యత, రుచి దెబ్బతినడమే కాక, వంట కార్మికులు, విద్యార్థులు పొగ శ్వాసించి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 747 పాఠశాలల్లో 1,290 మంది వంట కార్మికులు పనిచేస్తుండగా, కేవలం 71 పాఠశాలలకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. బెల్లంపల్లి 28, కాసిపేట్–4, మందమర్రి –8 చెన్నూర్–14, జన్నారం–08, తాండూర్ మండలంలోని 9 పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్‌లు అందినప్పటికీ, సిలిండర్ సరఫరా లేకపోవడంతో అవి వినియోగంలోకి రాలేదు.
నిధులు చెల్లిస్తేనే..
గ్యాస్ కనెక్షన్‌ల అమలు విజయవంతం కావాలంటే, ప్రభుత్వం నెలవారీ సిలిండర్ సరఫరాకు నిధులను కేటాయించాలి. ఏజెన్సీల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలి. ఇది విద్యార్థులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడమే కాక, వంట కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లేకపోతే, గ్యాస్ కనెక్షన్‌ల పథకం కేవలం కాగితంపైనే మిగిలిపోయే ప్రమాదం ఉంది.