
అసౌకర్యాల ‘ఖేలో’
ఏడాది పూర్తయినా వసతి లేక ఇబ్బందులు
జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోనే బాక్సింగ్ సాధన
వర్షం పడితే బురదగా మారుతున్న మైదానం
మంచిర్యాలటౌన్: జిల్లాల నుంచి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా శిక్షణ అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాకు ఒక ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం కేటాయించింది. మంచిర్యాల జిల్లాకు గత ఏడాది ఫిబ్రవరిలో కేటాయించి బాక్సింగ్ ఉచిత శిక్షణకు అవసరమైన నిధులు, సామగ్రి అందజేసింది. కానీ జిల్లా కేంద్రంలో స్టేడియం, క్రీడలకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో జిల్లా యువజన క్రీడల శాఖకు కేటాయించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానాన్ని వినియోగిస్తున్నారు. బాలుర ఉన్నత పాఠశాలలోని సైన్స్ భవనంలో ఒక గదిని కేటాయించారు. ఆ గదిలో సామగ్రికి మాత్రమే స్థలం ఉండడంతో వరండాలోనే బాక్సింగ్ శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే 55 మంది బాక్సింగ్ శిక్షణలో చేరడంతో పాఠశాల మైదానంలో శిక్షణ ఇస్తున్నారు.
వర్షం పడితే ఇక అంతే
జెడ్పీ బాలుర పాఠశాల మైదానంలో శిక్షణ పొందుతుండగా వర్షాకాలం వస్తే చాలు బురదగా మారి, శిక్షణకు ఇబ్బందిగా మారుతోంది. బాక్సింగ్ శిక్షకుడు రాజేశ్ ఆధ్వర్యంలో 55 మంది శిక్షణ పొందుతుండగా, వీరు జిల్లాస్థాయిలో 49 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ రకాల బాక్సింగ్ పోటీల్లో 24 గోల్డ్‌మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 16 బ్రాంజ్ మెడల్స్ అందుకున్నారు. జాతీయస్థాయిలోనూ 25 మంది పాల్గొనగా.. ఇద్దరు సిల్వర్ మెడల్స్ దక్కించుకున్నారు. అరకొర సౌకర్యాలతోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. సరైన వసతులు కల్పిస్తే మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించి నిలిపివేశారు. స్టేడియం నిర్మాణం పూర్తయితేనే బాక్సింగ్ క్రీడల్లో జాతీయస్థాయిలో గోల్డ్‌మెడల్స్ సాధించేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖేలో ఇండియా కేంద్రంలో శిక్షణ పొందుతున్న వారు సాధిస్తున్న మెడల్స్‌తో బాక్సింగ్‌పై పలువురు ఆసక్తి కనబర్చుతున్నారు.

అసౌకర్యాల ‘ఖేలో’