
వెళ్లిరా వినాయక
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/దండేపల్లి/మంచిర్యాలఅర్బన్: చవితి ఉత్సవాల్లో పూజలు అందుకున్న గణేషుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం శోభాయమానంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. హాజీపూర్ మండలంలో 104 వరకు గణేశ్ మండపాలు ఏర్పాటు చేయగా 82 ప్రతిమలు డప్పుల చప్పుళ్లు, ఆనందోత్సాహాల మధ్య నిమజ్జనం చేశారు. గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లోని సర్వజన గణేశ్ మండలి గణనాథుడిని నిమజ్జనం చేశారు. లడ్డూను వేలం పాటలో హెడ్ కానిస్టేబుళ్లు నర్సన్న, రాంబాబు రూ.17,500కు దక్కించుకున్నారు. కమాండెంట్ దంపతులు వెంకటరాములు, పద్మ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చిన్న వినాయక విగ్రహాలను గుడిపేట బ్యాక్ వాటర్‌లో, మిగిలిన విగ్రహాలను దండేపల్లి మండలం గూడెం గోదావరి, జైపూర్ మండలం ఇందారం గోదావరి బ్రిడ్జి, మంచిర్యాల గోదావరి తీరాలకు తరలించి నిమజ్జనం చేశారు. దండేపల్లి మండలంలో శుక్రవారం నిమజ్జన వేడుకలు నిర్వహించారు. దండేపల్లి, మంచిర్యాల, లక్సెట్టిపేట మండలాలతోపాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి తీసుకొచ్చిన వినాయక విగ్రహాలను దండేపల్లి మండలం గూడెం గోదావరి నదీ తీరం వద్ద క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించి సూచనలు చేశారు.
నేడు మంచిర్యాలలో..
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలలోని గణేష్ ప్రతిమల నిమజ్జనానికి అంతా సిద్దం చేశారు. మంచిర్యాల, ఇందారం గోదావరినది, దండేపల్లి మండలం గూడెం వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నేతృత్వంలో ముగ్గురు ఏసీపీలు, సీఐ, ఎస్సైలతోపాటు 641మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
వాహనాల దారి మళ్లింపు..
నిమజ్జనానికి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి నుంచి వచ్చే వాహనాలను పట్టణంలోకి రాకుండా లక్ష్మీటాకీస్ చౌరస్తా నుంచి బైపాస్‌రోడ్ మీదుగా గూడెం వద్ద గోదావరి నది(రాయపట్నం) వద్దకు మళ్లిస్తారు. నగరంలోని ఏసీసీ, మారుతినగర్, లక్ష్మీనగర్, హైటెక్‌సిటీ కాల నీ గణేష్ బెల్లంపల్లి చౌరస్తా మీదుగా టీటీడీ కల్యాణ మండపం మీదుగా ముఖరాం చౌరస్తా వరకు వెళ్లాల్సి ఉంటుంది. గౌతమినగర్, ఇస్లాంపుర, రాళ్లపేట్, ఇందిరానగర్, హనుమాన్‌నగర్, రెడ్డికాలనీ, సంజీవయ్య కాలనీ, చింతపండువాడ, ఎల్‌ఐసీ కాలనీ వాసులు రైల్వేస్టేషన్ మీదుగా కానీ వెంకటేశ్వరటాకీస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మూడు ఫీట్లు వినాయకులు కాలేజీరోడ్ గోదావరిలో, అంతకంటే ఎక్కువ ఎత్తు గల గణనాథులు ఇందారం, రాయపట్నం గోదావరిలో నిమజ్జనం చేయాలి.

వెళ్లిరా వినాయక

వెళ్లిరా వినాయక