
ఎరువు దరువు !
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వానాకాలం పంటలకు రైతులకు ఎరువు దొరకడం లేదు. ముఖ్యంగా యూరియా కోసం రైతులు తంటాలు పడుతున్నా రు. నిత్యం పీఏసీఎస్‌లు, దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. జిల్లాలో 3.33 లక్షల ఎకరాల్లో పంటల సాగవుతాయని అంచనా వేయగా, వర్షాల ఆలస్యం కారణంగా 3.11 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఇందులో 1.60 లక్షల ఎకరాల్లో పత్తి, 1.10 లక్షల ఎకరాల్లో వరి, మిగిలినవి మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు వంటి పంటలు ఉన్నాయి. జిల్లాకు 28 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఇప్పటివరకు 22,225 మెట్రిక్ టన్నులు జిల్లాకు వచ్చింది. వీటిలో 7 వేల మెట్రిక్ టన్నుల యూరియాతోపాటు డీఏపీ, ఎన్‌పీకే వంటి ఇతర ఎరువులు ఉన్నాయి. పత్తి, వరి పంటలకు యూరి యా వాడకం పెరగడంతో డిమాండ్ గణనీయంగా పెరిగింది. చెన్నూరు, తాండూరు, దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం, కోటపల్లి మండలాల్లో సహకార, ప్రైవేటు దుకాణాల వద్ద యూరియా కోసం రైతులు నిత్యం క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. సరిపడా దొరకకపోవడంతో పోలీసుల సమక్షంలో ఎరువుల పంపిణీ జరుగుతోంది.
సరఫరాలో లోపాలు..
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎరువుల సరఫరా లో వ్యత్యాసం కనిపిస్తోంది. పంట విస్తీర్ణం పెరగ డం, వ్యవసాయ శాఖ అంచనాలకు వాస్తవ సాగు వివరాలకు తేడాలు ఉండటం సరఫరా సమస్యకు ప్రధాన కారణం. కొంతమంది పెద్ద రైతులు, ఆర్థిక స్థోమత ఉన్నవారు యూరియా కొరతను ముందుగానే అంచనా వేసి బస్తాల కొద్దీ నిల్వ చేసుకున్నా రు. దీంతో కొందరు వ్యాపారులు తమకు తెలిసిన వారికి ఎక్కువ బస్తాలు ఇచ్చి లాభం పొందారు. వర్షాలు ఒకేసారి కురవడంతో యూరియా డిమాండ్ గణనీయంగా పెరిగింది. యూరియా బదులు ఇతర ఎరువులను రైతులకు అంటగట్టి అధిక ధరలకు విక్రయించారు. బ్లాక్ మార్కెట్‌కు ఎరువులు తరలిస్తూ మూడు చోట్ల అధికారులకు దొరికిపోయారు. ఒకేసారి విత్తనాలు వేయడం, ఎరువుల మోతాదు మించి వాడటం, సేంద్రియ ఎరువులను నిర్లక్ష్యం చేసి రసాయన ఎరువులపై ఆధారపడటం కూడా డిమాండ్ పెరుగుదలకు కారణమైంది.
మంత్రి, ఎమ్మెల్యే చొరవతో సరఫరా..
మంచిర్యాల నియోజకవర్గంలో రైతుల ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఈ నెల 10లోపు 400 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాలకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తామని తెలిపారు. గత నెలలో మంత్రి వివేక్ చొరవతో చెన్నూరు నియోజకవర్గానికి 420 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అయినప్పటికీ, జిల్లాకు ఇంకా 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంది.
ఇబ్బంది లేకుండా చర్యలు
జిల్లాలో ఇప్పటికే సరిపడా యూరియా పంపిణీ చేశాం. రైతుల డిమాండ్ దృష్ట్యా ఎప్పటికప్పుడు అవసరమేరకు పంపిణీ చేస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ యూరియా అందుతుంది.
– ఛత్రునాయక్, జిల్లా వ్యవసాయ అధికారి