
గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
● ఆస్పత్రిలో చికిత్స అందించిన సిబ్బంది ● నిలకడగా బాలికల ఆరోగ్యం ● పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో శంకరమ్మ
రెబ్బెన(ఆసిఫాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెబ్బెనలోని గురుకుల బాలికల పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో బాలికలు పగలంతా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. రాత్రి భోజనం ముగించుకుని పడుకోగా.. పదో తరగతి చదువుతున్న స్పందన, సంకీర్తన, సంజన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి స్పందన, సంజనను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంకీర్తన ఆరోగ్యం కుదుటపడడంతో బెల్లంపల్లి నుంచి ఇంటికి పంపించారు. మళ్లీ సోమవారం ఉదయం మరో విద్యార్థిని అక్షర సైతం అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను రెబ్బెన పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం బెల్లంపల్లికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎంపీడీవో శంకరమ్మ సోమవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలతో పాటు పరిసరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.
ఆరోగ్య సమస్యలతోనే అస్వస్థత
బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రజిని తెలిపారు. ఆదివారం విద్యార్థులంతా ఆనందంగా ఉన్నారని, రాత్రి భోజనాలు చేసి పడుకున్న తర్వాత ముగ్గురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. సోమవారం ఉదయం మరో విద్యార్థిని అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించామన్నారు. బాలికలు గైనక్ సమస్యతో పాటు ఆస్తమా, ఆయాసం వంటి కారణాలతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇదే విషయంపై రెబ్బెన పీహెచ్‌సీ వైద్యాధికారి సుజిత్‌ను వివరణ కోరగా.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. స్కానింగ్, ట్యూల్ కల్చర్ పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. కడుపునొప్పి, ఆయాసంతో పీహెచ్‌సీకి రాగా ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తరలించినట్లు తెలిపారు.

గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

గురుకుల విద్యార్థినులకు అస్వస్థత