
రాష్ట్రస్థాయి పోటీలకు ‘గురుకులం’ విద్యార్థులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 2న శనివారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జావెలిన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ముల్కల్ల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఏ.ఉల్లాస్ జావెలిన్‌త్రోలో బంగారు పతకం, బి.కార్తీక్ పరుగు పందెంలో రజత పతకం, స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో కాంస్య పతకం, రిత్విక్ 60 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం, స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో రజత పతకం సాధించారు. ఈ నెల 7న జనగామ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పాల్గొననున్నారు. సోమవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మారయ్య, ప్రిన్సిపాల్ కుమ్మరి మోహన్, వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వరరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, పీడీ శ్రీకాంత్, పీఈటీ సాగర్, ఉపాధ్యాయులు అభినందించారు.