
ఒకరికి ఏడాది..
భీమిని: మహిళను వివస్త్రను చేయడమే కాకుండా దుర్భాషలాడినందుకు ఒకరికి ఏడాది జైలుశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ బెల్లంపల్లి కోర్టు న్యాయమూర్తి జే.ముఖేష్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. 2017లో భీమిని మండలంలోని వీగాం గ్రామానికి చెందిన గాండ్ల అంకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ మహిళను వివస్త్రను చేసి, బూతులు తిట్టడంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శేఖర్ కేసు నమోదు చెశారు. కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆరుగురు సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పాతకక్షలతో ఒకరిపై దాడి
లక్ష్మణచాంద: పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఒకరిపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని రాచాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గైనం చిన్నయ్య కొన్నేళ్ల క్రితం లక్ష్మణచాందకు ఇల్లరికం వెళ్లాడు. మూణ్నెళ్ల క్రితం తన తల్లి అనారోగ్యానికి గురికావడంతో రాచాపూర్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద భజనకు వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన భూషి రాకేష్ పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని చిన్నయ్యను దుర్భాషలాడడమే కాకుండా అతనిపై కర్రతో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుమారుడు ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.