
సింగరేణి లాభాలు ప్రకటించాలి
రెబ్బెన: గత ఆర్థిక సంవత్సరం సింగరేణి ఆర్జించిన లాభాలను వెంటనే ప్రకటించాలని హెచ్‌ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు కోరారు. శుక్రవారం గోలేటి సీహెచ్‌పీలో ఎస్‌ఈ కోటయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా ఎన్నికై న ఏఐటీయూసీ లాభాలను ప్రకటించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటూ దేశానికి వెలుగులు ప్రసాదిస్తున్న సింగరేణి కార్మికులు గత సంవత్సరం సంస్థ ఆర్జించిన లాభాలు తెలియక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఏఐటీయూసీ చేతకాని తనంతోనే లాభాల ప్రకటనలో జాప్యం ఏర్పడుతోందని విమర్శించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చేస్తామని ఎన్నికల సందర్భంగా ఏఐటీయూసీ హామీ ఇచ్చిందని, గుర్తింపు సంఘంగా గెలిచి 18 నెలలు పూర్తవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. ఏఐటీయూసీ నాయకత్వం పోరాటాలను మరిచి కార్మిక హక్కులను యాజమాన్యానికి తాకట్టుపెట్టి కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలు ప్రకటించి కాంట్రాక్టు కార్మికులకూ లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. పిట్ కార్యదర్శి ఎండీ ఆరీఫ్, ఏరియా ఆర్గనైజర్ మరిశెట్టి దత్తు, కాంట్రాక్ట్ వర్కర్స్ పిట్ కార్యదర్శి బాలేశ్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి దీపక్‌రాజ్, ఆర్గనైజర్ రాజేశ్, కార్మికులు శోభన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.