
రైతు సంక్షేమంపై ప్రభుత్వాలు స్పందించాలి
దిలావర్‌పూర్: రైతు సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆత్మహత్యలు ఆపాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని మాయాపూర్ గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ కామిండ్ల భీమన్న కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. బాధి త కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు ప్రభుత్వాలు ముందే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులనూ ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఇప్పటివరకు ఇస్తున్న రైతు బీమా పరిహారాన్ని రెట్టింపు చేయాలని కోరారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు 60 ఏళ్లు దాటితే వారికి నెలకు రూ.5వేల పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.10లక్షలు అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రైతు సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ, కోశాధికారి సూర్యకిరణ్, స్థానిక పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.