
బొగ్గు ఉత్పత్తిపై వర్షాల ప్రభావం
శ్రీరాంపూర్: గత జూలైలో వర్షాలతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడిందని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీ నివాస్ తెలిపారు. శుక్రవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. జూలైలో 370 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని పేర్కొన్నారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 4.89 లక్షల టన్నులకు 4.30 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 21.49 లక్షల టన్నులకు 19.85 లక్షల టన్నులు సాధించి 92 శాతం లక్ష్యాన్ని నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వర్షాలతో ఓసీపీల్లో స్టాక్ కోల్ లిఫ్ట్ చేసినట్లు తెలిపారు. భూగర్భ గనుల్లో ఆర్కే 5, ఆర్కే 7, ఆర్కే న్యూటెక్, ఎస్సార్పీ 1, ఓసీపీల్లో ఐకే ఓసీపీ 135 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకున్నట్లు వివరించారు. డీజీఎం (పర్సనల్) అనిల్‌కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, సీనియర్ పీవో కాంతారావు పాల్గొన్నారు.