టైగర్‌ లేని జోన్‌! | - | Sakshi
Sakshi News home page

టైగర్‌ లేని జోన్‌!

Jul 29 2025 8:24 AM | Updated on Jul 29 2025 8:24 AM

టైగర్

టైగర్‌ లేని జోన్‌!

ఇబ్బందికరంగా పులి కారిడార్‌..

తాడోబా, ఇంద్రావతి, తిప్పేశ్వర్‌లో అనేక పులులున్నాయి. అక్కడి నుంచి పులులు కవ్వాల్‌ టైగర్‌జోన్‌కు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం పులి వచ్చే కారిడార్‌ ఇబ్బందికరంగా మారింది. జనావాసాలు పెరిగాయి. కాలువలు, పొలాలు పెరగడంతో పులి రాకపోకలు నిలిచిపోయాయి. జన్నారం అడవులు పులికి అనువైన ప్రదేశం. పులులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవాలంటే వన్యప్రాణుల సంఖ్య పెరగాలి. అందుకోసం కొన్నేళ్లుగా గడ్డి పెంచుతున్నాం. దీంతో వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. ఆలస్యంగానైనా పులి ఈ ప్రాంతానికి తప్పక వస్తుంది.– రామ్మోహన్‌,

డివిజనల్‌ అటవీ అధికారి, జన్నారం

జీవ వైవిధ్యంలో పెద్దపులి పాత్ర ఎంతో గొప్పది. పులి ఉన్నచోట దట్టమైన అడవులుంటాయి. వాతావరణంలో సమతుల్యత ఏర్పడుతుంది. పచ్చని అడవులు సంరక్షించబడుతాయి. అలాంటి పులుల సంతతి పెంచేందుకు తెలంగాణలో రెండో టైగర్‌జోన్‌గా కవ్వాల్‌ టైగర్‌జోన్‌ ఏర్పాటు చేశారు. దట్టమైన అడవులు, సరిపడా వన్యప్రాణులు, పది పులులు సైతం స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా ఉండే ఈ అడవుల్లో ఆవాసం ఏర్పాటు చేసుకోవడంలో పులి ఎందుకో ముఖం చాటేస్తుంది. ఇక్కడికి రాకపోకలతోనే సరిపెడుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఇక్కడ పులి ఆవాసం ప్రశ్నార్థకంగా మారింది. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో పులి సంచారంపై ప్రత్యేక కథనం.. – జన్నారం

కవ్వాల్‌ అభయారణ్యం దట్టమైన అడవులు, వివిధ రకాల వన్యప్రాణులకు నెలవు. చెంగుచెంగున ఎగిరే వన్యప్రాణులు, జలజల సవ్వడి చేసే జలపాతాలు, కిలకిలరావాలు పలికే పక్షులు వీటన్నింటి కలబోతగా కవ్వాల్‌ అభయారణ్యం నిలుస్తోంది. కవ్వాల్‌ అభయారణ్యాన్ని 2012 ఏప్రిల్‌ 10న పులుల రక్షిత ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అభయారణ్యంలో 893 చ.కి.మీ కోర్‌ ఏరియా, 1123 చ.కి.మీ బఫర్‌ ఏరియాగా పేర్కొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు జిల్లాల నుంచి ఆరు డివిజన్‌లుగా విభజించి కవ్వాల్‌ సర్కిల్‌ ఏర్పాటు చేసింది. ఈ అడవుల్లో పులికి ఇష్టమైన దుప్పులు, కొండగొర్రెలు, మేకాలు, నీలుగాయిలు, సాంబార్లు, చుక్కల దుప్పులు, అడవి పందులు వంటి శాఖాహార జంతువులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవికుక్కలు, నక్కలు, తోడేళ్లు వంటి మాంసాహార జంతువులు ఆవాసం ఉంటున్నాయి. ఐదేళ్లుగా అడవిలో గడ్డి క్షేత్రాలు, నీరు, ఆవాసం వంటి సౌకర్యాలు కల్పిస్తుండటంతో శాఖాహార జంతువుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా పులి రాకపోకలు సాగించడమే తప్పా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు.

పులి ఆవాసం కోసం అభివృద్ధి..

కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో అత్యధికంగా అడవి, ఆవాస యోగ్యం, వన్యప్రాణులున్న ప్రాంతంగా జన్నారం అటవి డివిజన్‌ ఉంది. టైగర్‌జోన్‌లో 22 శాతం మా త్రమే జన్నారం డివిజన్‌లో ఉంది. పులి ఆవాసం ఏ ర్పాటు చేసుకునేలా అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. కాంపా, కేంద్ర ప్రభుత్వ నిధులతో అడవుల్లో కుంటల నిర్మాణం, గడ్డి క్షేత్రాలు, సాసర్‌ వెల్స్‌, బేస్‌క్యాంపుల నిర్వహణ, ఎనిమల్‌ ట్రాకర్స్‌, తదితర అభివృద్ధి పనులతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగేళ్లలో 900 హెక్టర్లలో గడ్డి క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా జన్నారం అటవి డివిజన్‌లో వన్యప్రాణుల సంఖ్య సైతం రెట్టింపయ్యింది.

కారణాలు అనేకం..

పులి చాలా బరువైన జంతువు. తేలిగ్గా వేటాడటానికి ఇష్టపడుతుంది. అందుకే గడ్డి మాటున వన్యప్రాణులను చూసి వాటిపైకి దూకి వేటాడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. పులి పలుమార్లు జన్నారం డివిజన్‌కు వస్తూ వెళ్తూ ఉంది. ఇక్కడ దట్టమైన టేకు వనం ఉండడంతో పాటు గుబురైన పొదలు, ఇతర పలు రకాల చెట్లు పులి వేటకు చెక్‌ పెడుతున్నాయి. అదే విధంగా పులికి అలజడి లేకుండా ఉంటేనే ఆవాసం ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది. కానీ ఇక్కడి డివిజన్‌లో పలు రకాల అలజడుల వల్ల పులి ఇక్కడ ఉండటం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.

2021లో జన్నారం డివిజన్‌లో కెమెరాకు చిక్కిన పులి

రాకపోకలతోనే సరిపెడుతున్న పులి

సౌకర్యాలు కల్పిస్తున్నా చుట్టపు చూపే..

మూడేళ్లుగా కానరాని జాడ

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

2022లో కనిపించిన పులి..

కవ్వాల్‌ టైగర్‌జోన్‌లోని జన్నారం, ఖానాపూర్‌, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌ డివిజన్‌లలో పులి పలుమార్లు రాకపోకలు కొనసాగించింది. కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిసర పరిధిలో తిప్పేశ్వర్‌, తాడోబా, ఇంద్రావతి టైగర్‌జోన్‌లు ఉన్నాయి. ఆయా టైగర్‌జోన్‌ల నుంచి పులులు కవ్వాల్‌ టైగర్‌జోన్‌లోకి రాకపోకలు కొనసాగించాయి. 2016 నుంచి 2022 వరకు దొంగపల్లి, అలీనగర్‌, ఖానాపూర్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాలలో పులి కెమెరాలకు చిక్కింది. అలీనగర్‌, దొంగపల్లి ప్రాంతాలలో పలు పశువులను సైతం వేటాడింది. కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో పులి అడుగులు వేస్తున్నా ఎందుకో ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. 2022లో ఖానాపుర్‌ డివిజన్‌లో కనిపించింది. ఇక మూడేళ్లుగా కవ్వాల్‌ అటవీ డివిజన్‌ సరిహద్దులోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో సంచరిస్తున్న పులులు.. టైగర్‌ జోన్‌లో అడుగు పెట్టకుండానే వెనుదిరుగుతున్నాయి.

టైగర్‌ లేని జోన్‌!1
1/1

టైగర్‌ లేని జోన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement