
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి
భైంసాటౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయు డు మృతి చెందిన ఘటన పట్ట ణంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుభీర్ మండలం సిర్పెల్లి తండాకు చెందిన ఆడె నరేశ్(50) ముధోల్‌లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం పాఠశాలకు బైక్‌పై వెళ్తుండగా, పట్టణంలోని సేవాలాల్ చౌక్ వద్దకు చేరుకోగానే, నిజామాబాద్ నుంచి భైంసా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కాగా, స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య అనితాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవనీత్ రెడ్డి తెలిపారు.
ఆటో, ద్విచక్రవాహనం ఢీ..
ఒకరి మృతి
భైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుభీర్ మండలం గోడాపూర్‌కు చెందిన గర్కే ప్రవీణ్ (32) పని నిమిత్తం నిజామాబాద్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి తన ద్విచక్రవాహనంపై భైంసాకు వస్తుండగా భైంసా నుంచి బాసర వైపునకు వెళ్తున్న ఆటో ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సై వెల్లడించారు.
చికిత్స పొందుతూ వివాహిత..
లక్సెట్టిపేట: మండలంలోని అంకతిపల్లి గ్రామానికి చెందిన మౌనిక (29) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌనికకు హజీపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి మహేశ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల పాప, ఏడాది బాబు ఉన్నారు. ఈక్రమంలో గత రెండు నెలల నుంచి తల్లిగారింటి వద్దే ఉంటున్న మౌనిక ఈనెల 24న ఇంటి ఆవరణలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య
దస్తురాబాద్: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో దైవకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నీరటి నరేశ్(23)కు ప్రవళికతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య సఖ్యత లేకపోవడం.. భార్య ప్రవళిక అనారోగ్యంతో పుట్టింటి వద్దనే ఉండటంతో మనస్తాపం చెందిన నరేశ్ శనివారం పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నరేశ్ మృతి చెందాడు.
జీవితంపై విరక్తితో
యువకుడు..
మంచిర్యాలక్రైం: జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్సై వెంకన్న గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ మండలం శీలపల్లి గ్రామానికి చెందిన బూసినేని బాలకృష్ణ (26) డిగ్రీ పూర్తి చేసి పని లేకుండా ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో పని చూసుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్తానని చెప్పి ఈనెల 25న ఇంటి నుంచి బయలుదేరాడు. 26న రాత్రి జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అనంతరం తానే స్వయంగా వెళ్లి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ 27న రాత్రి మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నెమ్మదిగా వెళ్లమన్నందుకు దాడి
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన గిన్నె సతీశ్ అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు కాసిపేట ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ముత్యంపల్లి పెద్దమ్మ గుడి సమీపంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు సతీశ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో ముత్యంపల్లికి చెందిన ముదురకోల రాజు, ఆవుల రాజేందర్‌లు బైక్‌పై అతివేగంతో రాగా నెమ్మదిగా వెళ్లాల్సిందిగా సతీశ్ సూచించాడు. దీంతో ఇద్దరు కలిసి సతీశ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. సతీశ్‌ను పక్కకు నెట్టివేయడంతో బండరాయిపై పడి ముఖానికి, తలకు తీవ్ర గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. కాగా కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించినటలు పేర్కొన్నారు. బాధితుడి సోదరి లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి