
ఇక ‘కొప్పుల’ శకం
● టీబీజీకేఎస్ ఇన్‌చార్జిగా నియామకం ● యూనియన్‌లో కవిత ఎపిసోడ్ క్లోజ్ ● పొమ్మన లేక పొగ బెట్టారని ప్రచారం ● నేడు గోదావరిఖనిలో ఈశ్వర్ పర్యటన
శ్రీరాంపూర్: టీబీజీకేఎస్ ఇన్‌చార్జిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకంతో ఆ యూనియన్ కొత్త జవసత్వాలు నింపుకోబోతోంది. ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన టీబీజీకేఎస్ ముఖ్యనేతల సమావేశంలో యూనియన్ ఇన్‌చార్జిగా కొప్పుల ఈశ్వర్‌ను నియమించిన విషయం తెలిసిందే. కొప్పులకు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు గతంలో సింగరేణి కార్మికునిగా పనిచేసిన అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో కార్మికులతో సంబంధం ఉన్న ఆయనకు యూనియన్ బాధ్యతలు అప్పగించడంపై గులాబీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ఆయన సోమవారం గోదావరిఖని ఏరియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బైక్‌ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం రాజ్యలక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో సింగరేణి స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి బ్రాంచినేతలు, పిట్ నేతలు, కేంద్ర కమిటీ నాయకులు హాజరు కానున్నారు.
పొమ్మన లేక...పొగబెట్టి
టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పొమ్మన లేక పొగబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి ఆమె యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. 13 ఏళ్లుగా యూనియన్ ఆధిపత్యం చెలాయిస్తున్న ఆమె స్థానాన్ని భర్తీ చేసేలా నేడు ‘కొప్పుల’కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. కవితను గౌరవాధ్యక్షురాలిగా తొలగించినట్లు అధికారికంగా ప్రకటించకపోయినా ఇన్‌చార్జి నియామకంతో ఆమెను నైతికంగా తప్పించినట్లేనని యూనియన్ నేతలు భావిస్తున్నారు. కాగా, కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో తనపట్టు కాపాడుకునేందుకు ఆమె పార్టీ, యూనియన్‌తో సంబంధం లేకుండా సింగరేణి జాగృతి విభాగం ఏర్పాటు చేశారు. దీనికి 11 ఏరియాల ఇన్‌చార్జీలనూ నియమించింది. ఆ తరువాత శ్రీరాంపూర్ లాంటి ఏరియాల్లో స్వయంగా పర్యటించారు. సింగరేణి జాగృతి నాయకుల ఇళ్లకు వెళ్లినా ఆమెకు టీబీజీకేఎస్ నేతల మద్దతు లభించలేదు. పార్టీ నుంచి ఆమె దూరం అవుతుందనే భావనతో యూనియన్ నేతలెవ్వరూ ఆమె కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో టీబీజీకేఎస్‌లో మార్పులు జరుగబోతాయనే సంకేతాలు అప్పుడే రాగా, తాజాగా కొప్పుల ఈశ్వర్ నియామకంతో తేటతెల్లమైంది.
పుట్టి ముంచింది పార్టీనే..
తెలంగాణ వాదంతో సింగరేణిలో పురుడు పోసుకుని జాతీయ సంఘాలకు దీటుగా నిలబడి రెండు పర్యాయాలు గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ రెండేళ్లుగా చతికిలా పడింది. ట్రేడ్ యూనియన్‌ను స్వతంత్రంగా ఉంచి పని చేయించాల్సిన బీఆర్‌ఎస్ యూనియన్ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుని చివరికి పుట్టిముంచిందనే వాదనలు ఉన్నాయి. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామని పార్టీ చేసిన సర్వేలో తేలడంతో పోటీ చేయలేమని ముందుగా ప్రకటించడంతో తీవ్ర మనస్తాపం చెంది అప్పటి యూనియన్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేసి పక్కకు తప్పుకొన్నారు. తీరా తేరుకొని ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీబీజీకేఎస్ పోటీకి సై అన్నప్పటికీ ఫలితాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. తరువాత నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురై ఇతర సంఘాల్లో చేరిపోయారు. దీనికి కారణం పార్టీ నాయకత్వం, కల్వకుంట్ల కవిత కూడా బాధ్యురాలేనని విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా కొప్పుల ఈశ్వర్ సారథ్యంలో యూనియన్ బలపడే అవకాశాలు ఉంటాయని క్యాడర్ ఆశతో ఉంది.

ఇక ‘కొప్పుల’ శకం